Hardik Pandya: ఆలస్యమైన మ్యాచ్‌.. హార్దిక్‌ పాండ్యకు జరిమానా

ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 19 Apr 2024 11:01 IST

ఇంటర్నెట్ డెస్క్: ముల్లాన్‌పుర్‌ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 9 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అయితే, కెప్టెన్ హార్దిక్‌ పాండ్య జరిమానాకు గురయ్యాడు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా అతడికి రూ. 12 లక్షల ఫైన్‌ను విధించినట్లు ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లను పూర్తి చేయడంలో ముంబయి విఫలమైంది. దీంతో చివరి రెండు ఓవర్లలో సర్కిల్ అవతల కేవలం నలుగురు ఫీల్డర్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ మేరకు ఐపీఎల్‌ కమిటీ ప్రకటన జారీ చేసింది. ‘‘ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ హార్దిక్‌కు స్లో ఓవర్‌రేట్‌ కారణంగా జరిమానా విధించాం. పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ పరిస్థితి చోటు చేసుకుంది’’ అని పేర్కొంది. 

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు: పాండ్య

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 192/7 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్‌ను 183 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హార్దిక్‌ మాట్లాడుతూ.. ‘‘చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మేం విజయం సాధించాం. ప్రతి విభాగంలో పరీక్షను ఎదుర్కొని సక్సెస్ కావడం ఆనందంగా ఉంది. ఎప్పుడూ మనమే పైచేయి సాధించాలనుకోవడంలో తప్పులేదు. ఐపీఎల్‌లో మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టం. అశుతోష్‌ ఇన్నింగ్స్‌ మమ్మల్ని ఒత్తిడికి గురి చేసింది. ప్రతి బంతిని చక్కగా ఆడాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. టైమౌట్‌ విరామంలోనూ బౌలింగ్‌ ఎలా వేయాలనే దానిపై చర్చించుకున్నాం. కొన్ని ఓవర్లలో పరుగులు ఇచ్చినా చివరికి మేం విజయం సాధించాం’’ అని పాండ్య తెలిపాడు.

మ్యాచ్‌ విశేషాలు.. 

  • సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. అందులో రెండు డకౌట్‌లు, రెండు హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం. దిల్లీపై 0, పంజాబ్‌పై 78, చెన్నైపై 0, బెంగళూరుపై 52 పరుగులు సాధించాడు. 
  • ఆరో వికెట్‌ పడిన తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టు పంజాబ్. ఇప్పుడు ముంబయిపై 106 పరుగులు చేసింది. అంతకుముందు రాజస్థాన్‌పై హైదరాబాద్ (2013) 115 పరుగులు రాబట్టింది.
  • ఈ సీజన్‌లో పంజాబ్‌ చివరి ఓవర్లలో ఓడిపోవడం ఇది నాలుగోసారి. బెంగళూరుపై 4 వికెట్లు, హైదరాబాద్‌పై 2 పరుగులు, రాజస్థాన్‌పై 3 వికెట్లు, ముంబయిపై 9 పరుగుల తేడాతో ఓడింది.
  • అశుతోష్‌ శర్మ చేసిన 61 పరుగులలో భారీ షాట్ల ద్వారానే హాఫ్ సెంచరీని రాబట్టడం గమనార్హం. ఇందులో 7 సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని