Bengaluru Vs Chennai: వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్‌ఎయిర్‌’ సిస్టమ్‌ కాపాడుతుందా?

చెన్నైతో మ్యాచ్‌ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్‌ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.

Published : 18 May 2024 00:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చావో రేవో లాంటి మ్యాచ్‌ వర్షార్పణం కాకుండా ఉండాలని బెంగళూరు బలంగా కోరుకుంటోంది. ఐపీఎల్ 17వ సీజన్‌లో తన చివరి లీగ్‌ మ్యాచ్‌ను చెన్నైతో ఆడేందుకు సిద్ధమవుతోంది. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ జరగడం బెంగళూరుకు అత్యంత కీలకం. మరోవైపు ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైనా చెన్నై నాకౌట్‌కు వెళ్లిపోతుంది. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌ అయినా జరగాలనేది ఆర్సీబీ అభిమానుల ఆకాంక్ష. మరి వర్షం పడి ఆగిన తర్వాత మైదానాన్ని సిద్ధం చేసేందుకు చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక పద్ధతులు ఉన్నాయి. గత వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా అహ్మదాబాద్‌లో పిచ్‌ను సిద్ధం చేయడంలో ఇబ్బంది ఎదురైన సంగతి తెలిసిందే.  బెంగళూరులో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఇక్కడ అత్యాధునికమైన ‘సబ్‌ఎయిర్‌’ సిస్టమ్‌ అందుబాటులో ఉంది. 

ఏం చేస్తుంది? 

కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌ దాదాపు పదేళ్ల నుంచి సబ్‌ ఎయిర్‌సిస్టమ్‌ను వినియోగిస్తోంది. తొలిసారి 2015లో భారత్ - దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్‌ కోసం ఈ పద్ధతిని తీసుకొచ్చింది. పిచ్‌తోపాటు, మైదానంలోని పచ్చిక కింద వివిధ లేయర్లలో ఇసుకను వాడారు. మిగతా మైదానాల్లో ఎక్కువగా మట్టిని నింపుతారు. ఇక్కడ ఇసుక ఉండటం వల్ల నీరు మైదానంలో ఉండకుండా మెషిన్‌ స్టార్ట్‌ చేయగానే బయటకు వచ్చేస్తుంది. అందుకోసం 200 హార్స్‌పవర్‌ యంత్రాలతో సబ్‌ఎయిర్‌ సిస్టమ్‌ రన్‌ అవుతుంది. అక్కడినుంచి నీటిని డ్రైనేజ్‌ల ద్వారా బయటకు పంపిస్తారు. ఆ తర్వాత డ్రయర్లు, రోప్స్‌తో గ్రౌండ్‌ను రెడీ చేసేస్తారు.

  • ఓ మోస్తరు వర్షం పడి ఆగితే 15 నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేసేయచ్చు. ఈ విధానంలో ఒక్క నిమిషంలోనే దాదాపు 10 వేల లీటర్ల నీటిని పీల్చేస్తుంది.
  • ఒకవేళ గంటలపాటు భారీ వర్షం పడి ఆగిందనుకుంటే.. 30 లేదా 40 నిమిషాల్లో మ్యాచ్‌ను నిర్వహించుకునేలా మైదానాన్ని సిద్ధం చేయొచ్చు. 
  • ఈ వ్యవస్థ కోసం అప్పట్లోనే 10 నుంచి 12 మిలియన్‌ డాలర్లను కర్ణాటక బోర్డు ఖర్చు చేసింది. భారత్‌లో తొలిసారి ఇక్కడే ప్రవేశపెట్టడం గమనార్హం.
  • శనివారం మాత్రం రాత్రి 10.30 గంటల్లోపే వర్షం ఆగిపోయి మ్యాచ్‌ ప్రారంభం కావాలి. లేకపోతే మ్యాచ్‌ రద్దు కావడంతోపాటు ఇరు జట్లూ చెరో పాయింట్‌ను పంచుకుంటాయి. చెన్నై నాకౌట్‌కు.. బెంగళూరు ఇంటికి వెళ్లిపోతాయి. 

ప్లేఆఫ్స్‌ సమీకరణాలు మరింత సమాచారం

👉 బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్‌’ ఛాన్స్‌.. అదెలాగంటే?

👉 చెన్నైకి గోల్డెన్ ఛాన్స్‌.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని