Hyderabad vs Rajasthan: హైదరాబాద్‌.. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేస్తారా? 300 కొట్టేస్తారా?

టాప్‌ ప్లేస్‌లో ఉన్న రాజస్థాన్‌తో హైదరాబాద్‌ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్‌ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం.

Published : 02 May 2024 13:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో ఉప్పల్‌ స్టేడియం మరో మ్యాచ్‌కు వేదికగా నిలవనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయమవుతుంది. మరోవైపు గత రెండు మ్యాచుల్లో ఓడిన హైదరాబాద్‌ టాప్‌ -4 నుంచి కిందికి పడిపోయింది. ఇరు జట్ల మధ్య ఇవాళ రాత్రి 7.30 గంటలకు జరగనుంది.

మరో రికార్డు బద్దలు అవుతుందా? 

  • ఉప్పల్‌ మైదానంలో ముంబయిపై హైదరాబాద్‌ 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోసారి రాజస్థాన్‌పై విజృంభిస్తే సన్‌రైజర్స్ విజయం సాధించడం పెద్ద కష్టమేం కాదు. 
  •  ఐపీఎల్‌లోనే అత్యధిక స్కోరు (287) సన్‌రైజర్స్‌ పేరిటే ఉంది. దీంతో ఈసారి కూడా ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేస్తే 300 స్కోరు చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 
  •  ఐపీఎల్‌లో ఇరు జట్లు 18 మ్యాచుల్లో తలపడ్డాయి. చెరో తొమ్మిదేసి విజయాలతో కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఎవరు గెలిస్తే వారు ఆధిక్యంలోకి వస్తారు.
  • అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సంజూ శాంసన్ (385) ఏడో ప్లేస్‌, ట్రావిస్ హెడ్ (338) 11వ స్థానంలో ఉన్నారు. 
  • పర్పుల్ క్యాప్‌ను అందుకోవడానికి హైదరాబాద్‌ పేసర్ నటరాజన్‌ (13 వికెట్లు), రాజస్థాన్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (13 వికెట్లు) బరిలో ఉన్నారు. ప్రస్తుతం బుమ్రా (14) వద్ద ఈ క్యాప్‌ ఉంది. 
  • ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ తొమ్మిది మ్యాచుల్లో ఎనిమిది విజయాలు సాధించింది. 16 పాయింంట్లతో కొనసాగుతోంది. హైదరాబాద్ తొమ్మిదింట్లో కేవలం ఐదు మ్యాచుల్లోనే గెలిచింది. 
  • ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. టాస్‌ నెగ్గే జట్టు లక్ష్య ఛేదనకు మొగ్గు చూపనుంది. గత రెండు మ్యాచుల్లో ఒకసారి టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన హైదరాబాద్‌.. బెంగళూరుపై మాత్రం విఫలమైంది. 
  • ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ పండితుల అంచనా. క్లాసెన్, అభిషేక్ శర్మ ఆట కూడా అభిమానులను అలరించనుంది.
  • లక్ష్య ఛేదనలో విఫలమవుతున్న హైదరాబాద్‌ ఈసారి మాత్రం పట్టువిడకుండా ఆడాలి. కేవలం ముగ్గురిపైనే ఆధారపడకుండా.. మిగతా బ్యాటర్లూ రాణించాలి. బౌలింగ్‌లోనూ కాస్త పొదుపు పాటించాల్సిందే. 
  • ‘యశస్వి జైస్వాల్ - జోస్ బట్లర్’.. ‘హెడ్ - అభిషేక్ శర్మ’ జోడీల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తుందో ఆసక్తికరంగా మారింది.

తుది జట్లు (అంచనా): 

హైదరాబాద్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐదెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీశ్‌ రెడ్డి, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయ్‌దేవ్ ఉనద్కత్, నటరాజన్‌

రాజస్థాన్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెటమయేర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్‌ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని