T20 World Cup 2024: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ వేదిక మారుస్తారా? ఐసీసీ ఏం చెప్పిందంటే..?

T20 World Cup 2024: న్యూయార్క్‌ పిచ్‌లపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ జరగాల్సిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లను మరో చోటుకు మార్చాలంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఐసీసీ స్పందించింది.

Published : 06 Jun 2024 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ 2024 టోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికాలో న్యూయార్క్‌ మైదానంలోని పిచ్‌ (New York Pitch)పై తీవ్ర చర్చ జరుగుతోంది. బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ డ్రాప్‌ ఇన్‌ పిచ్‌ అనూహ్యంగా బౌన్స్‌ అవుతూ బ్యాటర్లను ఇబ్బందికి గురిచేస్తోంది. మొన్న ఇదే పిచ్‌పై శ్రీలంక 77 పరుగులకు కుప్పకూలగా.. నిన్న ఐర్లాండ్‌ను భారత్‌ 96 ఓవర్లకు ఆలౌట్‌ చేసింది. దీంతో ఈ పిచ్‌పై క్రికెట్‌ నిపుణుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్‌లో జరగాల్సిన మ్యాచ్‌ (T20 World Cup 2024)లను మరో వేదికకు మార్చాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జూన్‌ 9వ తేదీన ఇదే పిచ్‌పై భారత్‌, పాక్‌ జట్లు తలపడనున్నాయి. దీంతో దాయాదుల పోరు ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిణామాల వేళ తాజాగా ఐసీసీ (ICC) స్పందించింది. మ్యాచ్‌లను తరలించే అవకాశం లేదని తేల్చిచెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ‘‘న్యూయార్క్‌ గేమ్స్‌ను ఫ్లోరిడా లేదా టెక్సాస్‌ వేదికలకు మార్చే ప్రణాళికలు లేవు. భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ (India vs Pakistan) కోసం ఇప్పటివరకు ఉపయోగించని పిచ్‌ను కేటాయించాం. అయితే.. అంతకంటే ముందు ఇతర పిచ్‌లపై జరిగే మ్యాచ్‌ల ఫలితాన్ని బట్టి మా నిర్ణయాన్ని మార్చుకునే వెసులుబాటు ఉంది’’ అని ఐసీసీ అధికారులు చెప్పినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

ఇలాంటి పిచ్‌లపై ఆడాలంటే... ఇంకా చురుగ్గా ఉండాల్సిందే: జస్‌ప్రీత్ బుమ్రా

ఇప్పటికే ఈ పిచ్ (New York Pitch) తీరుపై బీసీసీఐ ఆందోళన వ్యక్తంచేసినట్లు వార్తలు వచ్చాయి. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్య బౌన్స్‌ కారణంగా ఇరు జట్ల బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. రోహిత్‌ శర్మ భుజానికి స్వల్ప గాయమై రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ దీనిపై స్పందిస్తూ.. ఇలాంటి ప్రమాదకరమైన పిచ్‌పై టీ20 మ్యాచ్‌ ఆడటం చాలా కష్టమని ఐసీసీ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఇలా కొత్తగా ఏదైనా ట్రాక్‌ను సిద్ధం చేసినప్పుడు ముందుగా టెస్టింగ్‌ కోసం ఇతర మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ (BCCI) అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకైతే దీనిపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీ (T20 World Cup 2024) కోసం సిద్ధం చేసిన ఈ న్యూయార్క్‌ స్టేడియంలో మొత్తం 10 టహోమా గ్రాస్‌ పిచ్‌లు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో పెరిగే ఈ గడ్డిని ఫ్లోరిడాకు సముద్రమార్గంలో తీసుకొచ్చి అక్కడినుంచి ట్రక్కుల్లో న్యూయార్క్‌కు తరలించారు. టోర్నీ ప్రారంభానికి కొద్ది వారాల ముందే ఈ డ్రాప్‌-ఇన్‌ పిచ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది సీమ్‌కు బాగానే సహకరిస్తున్నా.. బంతి అనూహ్యంగా బౌన్స్‌ అవుతుండటం బ్యాటర్లకు ఇబ్బందిగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు