IPL 2024 Auction: ఐపీఎల్‌ వేలం.. సొమ్మెంత? ఎప్పుడు? లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఐపీఎల్ వేలంలో (IPL) కాసుల పంట పండించే సమయం ఆసన్నమైంది. వచ్చే సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం జరగనుంది.

Published : 18 Dec 2023 13:39 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL) 2024 కోసం ప్లేయర్ల వేలానికి ఏర్పాట్లు జరిగాయి. దేశ, విదేశీ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే వేలంలోకి వచ్చిన ఆటగాళ్ల జాబితాను కూడా ఐపీఎల్‌ నిర్వాహకులు విడుదల చేసిన విషయం తెలిసిందే. 

ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుంది?

ఐపీఎల్‌ వేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది. ఇది 17వ ఐపీఎల్‌ వేలం. గతేడాది డిసెంబర్‌లోనూ చివరిసారిగా వేలం జరిగింది. 

లైవ్‌ ఎలా?

ఐపీఎల్‌ వేలం కార్యక్రమాన్ని నిర్వాహకులు లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తారు. స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌, జియో సినిమా ఓటీటీలో వీక్షించవచ్చు. 

ఎంతమంది అందుబాటులో ఉన్నారు?

తొలుత 1,166 మంది ప్లేయర్లు తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, ఐపీఎల్‌ నిర్వాహకులతోపాటు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిన 333 మందితో కూడిన తుది జాబితాను విడుదల చేశారు. 

ఎన్ని స్లాట్‌లు? అందులో ఓవర్సీస్ ఎన్ని?

పది ఫ్రాంచైజీలు దక్కించుకొనేందుకు 77 స్లాట్‌లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందులోనూ విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు 30 ఉన్నాయి. అయితే, మొత్తం 333 మందిలో 119 మంది విదేశీయులున్నారు.  

అందుబాటులో ఉన్న సొమ్మెంత? 

ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు పది ఫ్రాంచైజీలు కలిపి రూ. 262.95 కోట్లు వెచ్చించనున్నాయి. ఇందులో అత్యధికంగా గుజరాత్‌ టైటాన్స్‌ వద్ద రూ. 38.15 కోట్లు ఉండగా.. అత్యల్పంగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ వద్ద రూ. 13.15 కోట్లు మాత్రమే ఉన్నాయి. సన్‌రైజర్స్‌ వద్ద రూ.34 కోట్లు ఉండటం విశేషం.

డిమాండ్‌ వీరికే..

ఈ వేలంలో భారీ ధరను దక్కించుకునే అవకాశం ఉన్న వారిలో విదేశీ ప్లేయర్లే అధికంగా ఉన్నారు. ట్రావిస్‌ హెడ్, రచిన్‌ రవీంద్ర, స్టార్క్‌, కొయిట్జీ తదితరులు రేసులో ఉన్నారు. టాప్‌ ప్లేయర్ల జాబితా కోసం క్లిక్‌ చేయండి

పిన్న వయస్కుడు.. సీనియర్‌ ప్లేయర్‌ ఎవరంటే? 

దక్షిణాఫ్రికాకు చెందిన 17 ఏళ్ల క్వేనా మఫాకా పిన్న వయస్కుడు కాగా.. అఫ్గాన్‌కు చెందిన మహమ్మద్‌ నబీ అత్యధిక వయస్కుడు. నబీకి ప్రస్తుతం 38 ఏళ్లు.

వేలం నిర్వహణ ఎవరంటే? 

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) వేలం నిర్వహించిన  మల్లికా సాగర్‌ ఈ ఐపీఎల్‌ వేలం కూడా నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని