Rohit Sharma: ఐపీఎల్‌లో 10 రకాల కెమెరా యాంగిల్స్‌ ఉంటాయి.. ఇక్కడెందుకు లేవో?: రోహిత్

ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ ఘోర ఓటమిపాలైంది.  రెండో ఇన్నింగ్స్‌లో  భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ను థర్డ్ అంపైర్‌ క్యాచ్‌ ఔట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది. దీనిపై మ్యాచ్‌ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. 

Published : 12 Jun 2023 01:43 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final)లో టీమ్‌ఇండియా (Team India) ఘోర ఓటమిపాలైంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో  ఆసీస్‌ 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి డబ్ల్యూటీసీ గదను దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)ను థర్డ్ అంపైర్‌ క్యాచ్‌ ఔట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది. బోలాండ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ తొలి బంతి గిల్‌ బ్యాట్‌ను తాకి స్లిప్‌లో ఉన్న గ్రీన్‌ దగ్గర పడేలా కనిపించింది. కానీ, గ్రీన్‌ డైవ్‌ చేసి బంతిని అందుకున్నాడు. ఆ బంతి నేలకు తాకిందో లేదో అనే సందేహంలో ఉన్న అంపైర్లు.. టీవీ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బోరోకు నిర్ణయాన్ని వదిలేశారు. చాలాసేపు పరీక్షించిన తర్వాత బంతి కింద గ్రీన్‌ చేతి వేళ్లు ఉన్నాయని భావించి ఆ అంపైర్‌ ఔటిచ్చాడు. కానీ కొన్ని రిప్లేల్లో చూస్తే బంతి నేలకు తాకిందని స్పష్టంగా కనిపించింది. అంపైర్‌ గిల్‌ ఔట్‌గా ప్రకటించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కొంతమంది భారత మాజీ ఆటగాళ్లు కూడా థర్డ్ అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం మాట్లాడిన రోహిత్‌ శర్మ (Rohit Sharma) శుభ్‌మన్‌ గిల్‌ క్యాచ్‌ గురించి కూడా స్పందించాడు.

‘‘థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంతో నేను నిరాశ చెందాను.  అతను మరిన్ని రీప్లేలు చూడాల్సి ఉంది. మూడు లేదా నాలుగుసార్లు చూసి ఆ నిర్ణయం తీసుకున్నట్లున్నాడు. అది ఔటా? నాటౌటా అనే విషయం పక్కన పెడదాం. ఏ విషయమైనా దాని గురించి సరైన, స్పష్టమైన సమాచారం కలిగి ఉండాలి. క్యాచ్‌ విషయంలో థర్డ్ అంపైర్‌ తొందరగా నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి క్యాచ్‌ విషయంలో 100 శాతం కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఫైనల్. మరిన్ని కెమెరా యాంగిల్స్ ఉండాలి. ఒకటి, రెండు కెమెరా యాంగిల్స్ మాత్రమే చూపించారు.  ఐపీఎల్‌లో 10 రకాల కెమెరా యాంగిల్స్ ఉండటం మనం చూశాం. ఇంత పెద్ద మ్యాచ్‌లో అలాంటి ఏర్పాట్లు ఎందుకు లేవో నాకు తెలియదు. ఈ విషయంలో నేను కొంచెం నిరాశ చెందా’’ అని రోహిత్ శర్మ అన్నాడు. అదే విధంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో విజేతను నిర్ణయించడం కోసం ఒక మ్యాచ్‌ కాకుండా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను నిర్వహించాలని రోహిత్‌ శర్మ ఐసీసీకి సూచించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని