Ishan Kishan-Shreyas Iyer: ఇషాన్‌, శ్రేయస్‌లపై వేటు.. కాంట్రాక్టుల నుంచి తొలగించనున్న బీసీసీఐ..?

Ishan Kishan-Shreyas Iyer: హెచ్చరికలను పెడచెవిన పెట్టి రంజీలకు దూరంగా ఉంటున్న ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లపై బీసీసీఐ చర్యలకు సిద్ధమైంది. వారి కాంట్రాక్టులను రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.

Published : 23 Feb 2024 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్ జట్టు (Team India)కు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలపై అనాసక్తి చూపిస్తుండటం తీవ్ర చర్చకు దారితీసింది. యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan), శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) ఎలాంటి సహేతుకమైన కారణాల్లేకుండానే రంజీలు ఆడకపోవడాన్ని బీసీసీఐ (BCCI) తీవ్రంగా పరిగణించింది. ఈక్రమంలోనే వారిపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెంట్రల్‌ కాంట్రాక్టుల (Central Contracts) జాబితా నుంచి వీరిద్దరినీ తొలగించనున్నట్లు సమాచారం.

అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్టర్లు.. 2023-24 సీజన్‌కు గానూ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్ల తుది జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. త్వరలోనే బీసీసీఐ దీనిపై ప్రకటన చేయనుంది. అయితే, ఈ జాబితా నుంచి ఇషాన్‌, శ్రేయస్‌లను తొలగించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ హెచ్చరికలను పట్టించుకోకుండా దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉండటం వల్లే వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. 2022-23 సీజన్‌లో వీరిద్దరికీ బీసీసీఐ కాంట్రాక్టులిచ్చింది. సి-కేటగిరీలో ఇషాన్‌ ఏడాదికి రూ.కోటి, బి-కేటగిరీలో శ్రేయస్‌ రూ.3 కోట్లు అందుకున్నాడు.

బీసీసీఐ అల్టిమేటం వేళ.. హార్దిక్‌తో ఇషాన్‌ జిమ్‌ వీడియో వైరల్‌

మానసిక అలసటకు గురయ్యానంటూ గత డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో టీమ్‌ఇండియాకు దూరమైన ఇషాన్‌ అప్పటినుంచి ఏ మ్యాచ్‌లూ ఆడటం లేదు. రంజీలకు ఆడాలని బోర్డు గట్టిగా చెప్పినా.. ఏమాత్రం పట్టించుకోలేదు. తాజాగా అతడు హార్దిక్‌ పాండ్యతో కలిసి జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది.

అటు శ్రేయస్‌ అయ్యర్‌.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా గాయపడి విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాత రంజీల్లో ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే వెన్ను నొప్పి అని చెప్పి అతడు రంజీ మ్యాచ్‌కు డుమ్మా కొట్టాడు. కానీ, జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం శ్రేయస్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని