Yashasvi Jaiswal : స్వీయ నియంత్రణ పాటిస్తూ.. అనుభవమున్న ఆటగాడిలా..

అరంగేట్ర టెస్టు(WI vs IND)లోనే అదరగొట్టిన యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal) ఆటతీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. తొలి మ్యాచ్‌లోనే ఎంతో అనుభవమున్న ఆటగాడిగా అతడు ఇన్నింగ్‌ కొనసాగించిన తీరును మెచ్చుకుంటున్నారు.

Updated : 15 Jul 2023 07:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్‌ఇండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal ) గురించే ఇప్పుడు అంతటా చర్చ. అరంగేట్ర టెస్టు (WI vs IND)లోనే అదరగొట్టిన ఈ కుర్రాడి ఆటతీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. టీమ్‌ఇండియా జెర్సీ ధరించిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే.. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సత్తా ఏంటో చూపించాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను అధిగమించాడు. ఐపీఎల్‌లో అదరగొట్టినా.. తొలి టెస్టులోనే అద్భుత ప్రదర్శన చేసినా.. ఈ స్థాయికి చేరుకోవడానికి అతడు ఎన్నో కష్టాలు పడ్డాడు.

అప్పుడే చెప్పారు..

ఈ 21 ఏళ్ల కుర్రాడు.. ఈ ఐపీఎల్‌ (IPL 2023) సీజన్‌లో రాజస్థాన్‌ (rajasthan royals) జట్టు తరఫున అదరగొడుతున్న సమయంలోనే పలువురు మాజీలు అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్‌లో టీమ్‌ఇండియా (Team India)కు తప్పక ఆడతాడని.. అద్భుతాలు చేస్తాడని అప్పుడే చెప్పారు. ఈ క్రమంలోనే అతడు ఐపీఎల్‌ తర్వాత WTC Finalలో స్టాండ్‌బై ఆటగాడిగా వెళ్లాడు. ఇప్పుడు వెస్టిండీస్‌తో టెస్టు జట్టుకు ఎంపికై.. తొలి మ్యాచ్‌లోనే అదరగొడుతున్నాడు. ఇక 2013 ఐపీఎల్‌ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 163 స్ట్రైక్‌ రేట్‌తో మొత్తం 625 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, 5 అర్ధ శతకాలు ఉన్నాయి.

అనుభవం ఉన్న ఆటగాడిలా..

21 ఏళ్ల యశస్వి జైస్వాల్‌.. తొలి టెస్టులోనే ఎంతో అనుభవమున్న ఆటగాడిగా ఆడుతున్నాడు. అథనాజే బౌలింగ్‌లో శతకానికి చేరుకోగా.. హెల్మెట్‌ తీసి.. చేతులు పైకెత్తి తన శతక సంబరాలను చేసుకున్నాడు. అయితే.. మూడంకెల స్కోరుకు చేరుకోవడానికి ఎంతో ఓపికగా ఆడాడు. ఎందుకంటే డొమినికా పిచ్‌లో పరిస్థితులు అలా ఉన్నాయి. ఇక్కడ పలువురు సెంచరీలు చేసిన రికార్డులు ఉన్నా.. ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ఇప్పటి వరకూ ఎవరూ శతకం సాధించలేదు.

ఇక పిచ్‌ స్లోగా ఉంది. టర్న్‌, స్పాంజీ బౌన్స్‌.. రెండింటికీ సహకరిస్తోంది. ఔట్‌ఫీల్డ్‌ కూడా చాలా నెమ్మదిగా ఉంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీయే తొలి బౌండరీ బాదేందుకు 81 బంతులు తీసుకున్నాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడాలంటే ఎంతో అనుభవం ఉండాలి. అయినప్పటికీ.. శతకాన్ని నమోదు చేసి గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు యశస్వి. ఇక సెంచరీ పూర్తి కాగానే.. కాస్త దూకుడు పెంచాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 14 ఫోర్లతో 143 పరుగుల వద్ద ఉన్నాడు.

స్వీయ నియంత్రణ పాటిస్తూ..

జైస్వాల్‌కు ఇంతకుముందు ఐపీఎల్‌లో ఆడిన అనుభవమే ఎక్కువగా ఉంది. అక్కడంతా ధానాధన్‌ బ్యాటింగే. అయితే టెస్టులకు వచ్చేసరికి స్వీయ నియంత్రణ పాటించడం ఎంతో ముఖ్యం. బంతిని నిశితంగా గమనిస్తూ.. పరుగులు చేయడానికి అవసరమైన సమయం తీసుకునేందుకే జైస్వాల్‌ సిద్ధమయ్యాడు. అలాంటి నియంత్రణ పాటిస్తూ.. అవకాశం వచ్చినప్పుడల్లా  షాట్లకు ప్రయత్నించాడు జైస్వాల్‌. ముఖ్యంగా పేసర్లను టార్గెట్‌ చేస్తూ.. పరుగులు రాబట్టాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత ఖాతా తెరిచేందుకు 16 బంతులను తీసుకున్నాడు. అక్కడి నుంచి నిలకడైన ఆటతీరుతో ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా.. పేసర్లను టార్గెట్‌ చేశాడు.

వారి నుంచి 155 బంతులనెదుర్కొని 82 పరుగులు చేశాడు. స్పిన్నర్ల విషయంలో ఆచితూచి ఆడాలని నిర్ణయించుకున్నాడు. బంతి బాగా టర్న్‌ అవుతున్న సమయంలో.. కార్న్‌వాల్‌, వారికన్‌ బౌలింగ్‌లో పెద్ద షాట్లకు వెళ్లకుండా చాలా నెమ్మదిగా ఆడాడు. ద్విశతకం దిశగా వెళ్తున్న జైస్వాల్‌.. మరెన్నో రికార్డులు బద్దలు కొట్టాలని టీమ్‌ఇండియా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక జైస్వాల్‌ క్రికెట్‌ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముంబయిలో టెంట్‌ కింద నివసించడం, పానీ పూరీ విక్రయించడం.. ఇలా ఎన్నో కష్టాల అనంతరం అతడి క్రికెట్‌ జర్నీ ప్రారంభమైంది.

ఈ యువ విజేత స్ఫూర్తి గాథ గురించి క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని