Yashasvi Jaiswal: నీ సెంచరీ వెనుక ఎన్నో కష్టాలు.. యశస్విపై ప్రశంసల జల్లు

అరంగేట్రం చేసిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఘనంగా కెరీర్‌ను ప్రారంభించిన యశస్వి జైస్వాల్‌పై (Yashasvi Jaiswal) ప్రశంసల జల్లు కురుస్తోంది.

Updated : 14 Jul 2023 11:38 IST

ఇంటర్నెట్ డెస్క్: అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో అదరగొట్టిన టీమ్‌ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (143*)పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నిలకడైన ఆటతీరుతో జైస్వాల్‌ అందర్నీ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (103) తో కలిసి తొలి వికెట్‌కు 229 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో సంజయ్‌ బంగర్ - వీరేంద్ర సెహ్వాగ్‌ల 201 పరుగుల పార్టనర్‌షిప్‌ను రోహిత్-యశస్వి జోడీ అధిగమించింది. అలాగే అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో ఓపెనర్‌గానూ యశస్వి రికార్డు సృష్టించాడు. దీంతో అతడిని ప్రశంసిస్తూ మాజీ క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. 

‘‘యశస్వి సెంచరీతో సంబరాలు చేసుకునే కోట్లాది భారతీయ అభిమానులతో నేను కూడా కలిసిపోయా. యశస్వి ఎన్నో కష్టాలను అధిగమించి ఇక్కడకు వచ్చాడు. ఆత్మవిశ్వాసం, గొప్ప క్యారెక్టర్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులోనే సెంచరీ చేయడం అద్భుతం’’ - ఇయాన్ బిషప్, విండీస్‌ క్రికెట్ దిగ్గజం

‘‘నీ టెస్టు కెరీర్‌ సూపర్‌గా ప్రారంభమైంది. వెల్‌డన్‌ యశస్వి. కెప్టెన్‌ రోహిత్ నుంచి మరో అద్భుతమైన సెంచరీ వచ్చింది’’ - సచిన్‌

‘‘అద్భుతమైన కెరీర్‌కు నాంది పడింది. ఇలాగే కొనసాగాలి’’ - ఇర్ఫాన్ పఠాన్

‘‘నీదైన శైలిలో టెస్టు కెరీర్‌ను ప్రారంభించావు. ఇలాంటి సెంచరీతో అరంగేట్రం చేయడం అద్భుతం. భవిష్యత్తులోనూ ఇంకా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాలి’’ - ఆకాశ్ చోప్రా

‘‘నీ ఆటతీరు అద్భుతం. ఇన్నింగ్స్‌ చూసిన తర్వాత గర్వంగా అనిపిస్తోంది’’ - రాజస్థాన్‌ రాయల్స్

వారికి అంకితం: యశస్వి

మొదటి టెస్టులోనే సూపర్ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయాడు. అయితే తన సెంచరీ వెనుక ఎంతోమంది కృషి ఉందని తెలిపాడు. ‘‘ఇలాంటి సమయంలో ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడినందుకు ఆనందంగా ఉన్నా. భారత జట్టులో స్థానం దక్కడం చాలా కష్టం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నా. ఆ దేవుడి దయ, నా తల్లిదండ్రుల కష్టంతో ఇక్కడికి చేరుకున్నా. అందుకే నా తొలి సెంచరీని వారికి అంకితమిస్తున్నా. ఇంతకంటే మరే గొప్ప ఘనత ఉండదు’’ అని యశస్వి అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని