Yashasvi Jaiswal: ఆ దెబ్బలు తట్టుకోలేక ఏడ్చేసేవాణ్ణి..!

మే 11, గురువారం.. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం ఒక చరిత్రకు సాక్షిగా నిలిచింది. ఐపీఎల్‌ మొదలైన పదహారేళ్లలో మొదటిసారి పదమూడు బంతుల్లోనే హాఫ్‌సెంచరీ బాదేసిన ఓ కుర్రాడికి అది సలామ్‌ చేసింది.

Updated : 21 May 2023 10:46 IST

మే 11, గురువారం.. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం ఒక చరిత్రకు సాక్షిగా నిలిచింది. ఐపీఎల్‌ మొదలైన పదహారేళ్లలో మొదటిసారి పదమూడు బంతుల్లోనే హాఫ్‌సెంచరీ బాదేసిన ఓ కుర్రాడికి అది సలామ్‌ చేసింది. కష్టాలూ కన్నీళ్ల మధ్య కసిగా పరుగులు తీస్తూ.. ఆకలినీ అవమానాలనీ తన బ్యాటుతో లాగి కొట్టిన అతడే రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌. ఇది అతని కథ.. విజయానికి దగ్గరి దారులు ఉండవని చెప్పే ఓ యువ విజేత స్ఫూర్తి గాథ.

ళ్లు మిరుమిట్లుగొలిపే షాండ్లియర్లు.. కాలుపెడితే మాసిపోతాయన్నట్టుండే టైల్స్‌... విశాలమైన బాత్రూమ్‌లు... మెత్తని పరుపులతో ఎంతో సౌకర్యంగా ఉండే ఫైవ్‌స్టార్‌ హోటల్‌లోనే క్రికెటర్లకు ఆతిథ్యమిస్తారు. విందు భోజనాలు వడ్డిస్తారు. క్రికెటర్‌గా ఆ అద్భుత సౌకర్యాలను పొందినప్పుడు- చాలీచాలని వెలుతురుతో, వాన పడితే మునిగేపోయే నా టెంట్‌ గుర్తొస్తుంది. పానీపూరీ అమ్ముతూ, దాంతో కడుపు నింపుకున్న రోజులే కళ్ల ముందు మెదులుతాయి. ఇప్పుడు నేను ఎక్కడున్నానూ ఎలా ఉన్నానూ అన్నది తలకెక్కించుకోను... ఎక్కడి నుంచి వచ్చానూ, క్రికెటర్‌గా ఎలా పరిణతి చెందానూ అన్నది మర్చిపోను. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరిన నా ప్రయాణం అసలు ఎలా మొదలైందంటే...
మాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని సురియవాన్‌ అనే చిన్న పట్టణంలోని నిరుపేద కుటుంబం. అమ్మ ఇళ్లలో, నాన్న హార్డ్‌వేర్‌ షాపులో పనిచేసేవారు. ఆరుగురు సంతానంలో నేను నాలుగో వాణ్ని. మాకు కడుపునిండా అన్నం పెట్టడానికి అమ్మానాన్నలు పస్తులున్న రోజులు నాకు తెలుసు. అందరం మంచినీళ్లతోనే సరిపెట్టుకున్న రాత్రులెన్నో. అమ్మానాన్నల కష్టాన్ని చూస్తూ పెరిగిన నాకు ఆ సమస్యల్ని తీర్చాలని ఉండేది. కానీ చదువంటే అస్సలు ఇష్టముండేది కాదు. మా గల్లీలో పిల్లలతో ఎప్పుడూ ఆడుకునేవాడిని. వారి వల్ల చిన్నవయసులోనే క్రికెట్‌ చూడటం అలవాటైన నాకు సచిన్‌ తెందూల్కర్‌ ఆట ఎంతో నచ్చేది. హనుమంతుడి గుండెల్లో రాముడు కొలువైనట్టు సచిన్‌ బొమ్మ నా మనసులో ముద్రవేసుకుంది. తెలిసీ తెలియని వయసులోనే సచిన్‌ని ఆరాధిస్తూ ఆయనలా ఇండియా తరపున ఆడాలనుకునేవాణ్ని. ఆ విషయం ఇంట్లో నాన్నకి చెబితే ‘ఇంకోసారి క్రికెట్‌ అన్నావంటే కర్ర విరుగుతుంది..’ అని కళ్లెర్రజేశాడు. అప్పుడు నాకు పదేళ్లు. చిన్నవయసు కావడం వల్ల నాన్న అలా అన్నాడని ఇంకో సంవత్సరం ఆగా. అప్పటికీ ఆయనకి ఇష్టం లేదు. దాదాపు నెలరోజులపాటు బతిమాలుకుంటే ఆయన మనసు కరిగి అప్పుచేసి మరీ 2011లో ముంబయి తీసుకెళ్లాడు.

అర్ధరాత్రి గెంటేశారు

మా దూరపు బంధువు ఒకరు ముంబయిలో ఉండేవారు. వాళ్ల ఇంటికి వెళితే ఆజాద్‌ మైదాన్‌లో క్రికెట్‌ నేర్పిస్తారని చెప్పి మమ్మల్ని అక్కడకు పంపాడు. ఆ మైదానంలో ఆట సాధన చేయడానికీ, మెలకువలు తెలుసుకోవడానికీ బాగానే ఉంది కానీ ఉండటానికి వసతి లేదు. దాంతో ఆ మహానగరంలో నేను ఎలా ఉంటానో అని నాన్న భయపడి ఇంటికి వెళ్లిపోదామని పోరుపెట్టాడు. నేను రానంటే రానని మారాం చేస్తే... మా దూరపు బంధువులను ఒప్పించి వాళ్లింట్లో వదిలి వెళ్లాడు. కానీ, నాన్నతో బాగా చూసుకుంటానని చెప్పిన మా బంధువు కొన్నిరోజులకు నన్ను వదిలించుకోవాలనుకున్నాడు. సిటీకి దూరంగా ఓ డెయిరీలో పనికి కుదిర్చాడు. అక్కడే ఉండి రాత్రంతా ఆ డెయిరీలో గేదెల వద్ద శుభ్రం చేసి తెల్లవారుజామున పాలు పితకడం నా పని. అయితే పగటి పూట అక్కడున్నవారితో క్రికెట్‌ సాధన చేసేవాడిని. అది చూసి యజమాని కోప్పడేవాడు. దాంతో అతను లేనప్పుడు సాధన చేసేవాడిని. రాత్రిపూట డ్యూటీలో పొరపాటున నిద్రపోతే క్రికెట్‌ వల్లే పని ఎగ్గొట్టి నిద్రపోతున్నానని కొట్టేవాడు. ఆ  దెబ్బలకు ఓర్చుకోలేక ఎంతో ఏడ్చేవాణ్ని. ఏడుస్తూనే పనిచేసేవాణ్ని. అయినా సరిగా తిండి పెట్టకుండా, జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడు. కొంత కాలానికి నన్ను పనిలోంచి తీసేయాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి పూట కారణం కూడా చెప్పకుండా డెయిరీ నుంచి వెళ్లిపొమ్మన్నాడు. తెల్లారాక వెళతానన్నా వినకుండా నా దగ్గరున్న జత బట్టల సంచిని బయటకు విసిరేశాడు. అసలే బయట ఎముకలు కొరికే చలి. ఆ చీకట్లో బిక్కుబిక్కుమంటూ నడిచీ నడిచీ ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆజాద్‌ మైదానానికి చేరుకున్నా. అప్పటికే ఆకలి దంచేస్తోంది. మరో పక్క నీరసం- చేతిలో చిల్లిగవ్వలేదు. ఆ ఫుట్‌పాత్‌పైనే జారగిల పడ్డా. పీక్కుపోయిన నా ముఖం చూసి జాలిపడి ఓ పానీపూరీ బండి అతను- మెత్తబడిపోయి అమ్మకానికి పనికిరాని గోల్‌గప్పా ప్యాకెట్‌ను ఇచ్చాడు. జాగ్రత్తగా వాటితో ఆకలి తీర్చుకుంటూ ఆ మైదానం బయట రోడ్డు మీద పడుకునేవాడిని. పిల్లలు ఆడుకుంటుంటే ఆట గమనించేవాడిని. అప్పుడప్పుడూ నన్ను కూడా ఆడనిచ్చేవారు. ఆ సమయంలో నా ఆట చూసిన ఒకతను మైదానంలో ఓ టెంట్‌ కింద ఉండటానికి అధికారులతో మాట్లాడి అనుమతి ఇప్పించాడు. కానీ, ఆ టెంట్‌లో లైటూ, నీటి వసతీ లేవు. అరకిలోమీటరు దూరంలో బాత్రూమ్‌. చిన్న వానకే నీళ్లు లోపలికి వస్తాయి. అయినా సరే ముంబయి నగరంలో ఆ కాస్త చోటు దొరకడమే మహాభాగ్యం అనుకున్నా.

పానీ పూరీ అమ్ముతూ

ఎన్ని విషయాల్లో సర్దుకుపోయినా ఆకలితో మాత్రం రాజీ పడలేం. కడుపు కాలుతుంటే, నీరసంతో శోష వస్తుంటే ఆట మీద పట్టు తెచ్చుకోవడం కూడా అసాధ్యమే. బతకడానికి ఏదో ఒక మార్గం ఉండాలి. డెయిరీలో దెబ్బలు తిన్న తరవాత పనిలో కుదరాలంటే భయమేసింది. కానీ ఆకలికి తట్టుకోలేక నరకం కనిపించేది. అందుకే మైదానం బయట పానీ పూరీ అమ్మే అతనితో పరిచయం పెంచుకుని... నా పరిస్థితిని వివరించి పని ఇవ్వమని అడిగా. అందుకు అతను ఒప్పుకోవడంతో... పగలంతా క్రికెట్‌ సాధన చేస్తూ సాయంత్రం పానీపూరీ అమ్మేవాణ్ని. రాత్రిపూట ఆ పానీపూరీ తిని కడుపునింపుకునేవాణ్ని. అక్కడ వచ్చిన జీతంతో పగటిపూట భోజనం చేసేవాణ్ని. మరి ఆడటానికి శక్తి కావాలి కదా. ఇక క్రికెట్‌ సాధన చేయాలంటే కోచ్‌ ఉండాలి. కానీ నేను అక్కడ ఆడేవాళ్లను చూసి బంతి విసరడం, బ్యాటింగ్‌ చేయడం సొంతంగా సాధన చేసేవాణ్ని. ఎప్పుడైనా అక్కడ ఆడే టీములకు మనుషులు తగ్గితే నన్ను చేర్చుకునేవారు. అలా నాకు ఇష్టమైన క్రికెట్‌ను సాధన చేస్తుండేవాడిని. అయితే నాతో క్రికెట్‌ ఆడేవాళ్లు సాయంత్రం పూట మా పానీపూరీ బండి వద్దకు వచ్చేవారు. కొందరు మెచ్చుకునేవారు. మరికొందరు ‘నీలాంటి వాడితోనా మేం ప్రాక్టీసు చేసేది...’ అని అవమానంగా మాట్లాడేవారు. మైదానానికి రావద్దనీ, ఆడొద్దనీ గొడవ చేసేవారు. నాకు మాత్రం అవేవీ పట్టేవి కాదు. ఎలాగైనా సచిన్‌లా భారతదేశం తరపున క్రికెట్‌ ఆడాలన్నదే లక్ష్యం. దానికోసం ఎన్ని కష్టాలూ అవమానాలనైనా సహించాలని నాకు నేనే సర్ది చెప్పుకునేవాడిని. అలానే నాకు డబ్బు పంపలేక బాధపడుతున్న అమ్మానాన్నలకు  నా బాధలు చెప్పేవాడిని కాదు. తెలిస్తే నాన్న వెంటనే తీసుకెళ్లిపోతాడని ఎప్పటికప్పుడు నేను బాగున్నానంటూ ఉత్తరాలు రాస్తుండేవాణ్ని. అలా దాదాపు మూడేళ్లపాటు నానా అగచాట్లూ పడుతూ ఆటలో రాటుదేలా. టెక్నిక్స్‌ తెలుసుకున్నా. అయితే ఒకసారి అనుకోకుండా నా ఆటను గమనించారు కోచ్‌ జ్వాలా సింగ్‌. నాకు తెలియకుండా దాదాపు నెలరోజుల పాటు ఎన్నో రకాలుగా ఆట తీరును పరిశీలించిన ఆయన ఒకరోజు నాతో మాట కలిపారు. నా గురించి తెలుసుకుని... నాలో తనని చూసుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా క్రికెటర్‌ అవ్వాలని ఓ పల్లెటూరి నుంచి ముంబయి వచ్చారు. కానీ సరైన ప్లాట్‌ఫామ్‌ దొరక్క కోచ్‌గా పేద పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. నా సంగతి తెలిసి చేరదీశారు. పైగా అప్పటికి నేను పౌష్టికాహారం లేక బక్కచిక్కి ఉన్నా. ఇంగ్లిష్‌ కూడా రాదు. ‘క్రికెటర్‌ అంటే బలంగా ఉండాలి. దేశవిదేశాలకు వెళ్లినప్పుడు సాటి క్రీడాకారులతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలగాలి...’ అని శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. తన సొంత ఖర్చుతో మంచి భోజనం పెట్టేవారు. మరోవైపు మెరుగైన వ్యాయామాలు చేస్తూ శారీరకంగానూ, విజేతల గాథలు చదువుతూ మానసికంగానూ దృఢమయ్యా.

కసిగా బరిలోకి

2015లో తొలిసారి ఓ స్కూల్‌ టీమ్‌ తరపున ఆడి బ్యాటింగ్‌లో 319 పరుగులు, బౌలింగ్‌లో 13 వికెట్లు నమోదు చేశా. స్కూల్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులూ, వికెట్లూ తీసినందుకుగానూ ఆల్‌రౌండర్‌గా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోకి ఎక్కా. ఆ తరవాత ముంబయి అండర్‌-16లో వచ్చిన అవకాశం నా ప్రతిభను బయటి ప్రపంచానికి చాటి చెప్పింది. ఇండియా అండర్‌-19 జట్టుకు ఎంపిక అయ్యేలా చేసింది. 2018 ఆసియా కప్‌ను భారత్‌కు అందించడంలో కీలకపాత్ర పోషించా. క్రమంగా దేశవాళీ, రంజీట్రోఫీలూ, అంతర్జాతీయ టోర్నమెంట్లలోనూ సత్తా చాటడంతో అండర్‌-19 వరల్డ్‌ కప్‌కు ఆడే అవకాశం వచ్చింది. అక్కడ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన నా ఆట తీరు నన్ను ఐపీఎల్‌ వైపు అడుగులు వేయించింది. 2020లో ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుతో నా ప్రస్థానం మొదలైంది. ఐపీఎల్‌లోకి వచ్చాకే నేను చిన్నతనం నుంచి ఆరాధిస్తూ పెరిగిన సచిన్‌ సర్‌ని కలిసే అవకాశం వచ్చింది. నా గురించి తెలుసుకుని ఆటను ఇంకా మెరుగుపరచుకోవడానికి కొన్ని మెలుకువలు చెప్పారు. ఆ సలహాలు పాటిస్తూనే ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కసిగా సాధన చేస్తూనే ఆడుతున్నా. గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో నా ఆట తీరు నాకే సంతృప్తిగా అనిపించలేదు. అలా ఉంటే భారత జట్టులో ఆడేఅవకాశం ఎలా వస్తుందని మరింత సాధన చేసి ఈ సీజన్‌లో బరిలో దిగా. నా జట్టును గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకుని భారీ స్కోరు కోసం వీలైనన్ని ఫోర్లూ, సిక్సర్లూ బాదడానికి ప్రయత్నించా. ఈ ఆట ఐపీఎల్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ(13 బంతుల్లో)గా చరిత్ర సృష్టిస్తుందని అప్పుడు నాకు తెలియదు. ఇన్ని ప్రశంసలు తీసుకొస్తుందనీ ఊహించలేదు. ఆటలో కాకలుతీరిన క్రీడాకారులంతా నన్ను మెచ్చుకుని సందేశాలు పంపుతుంటే భారత క్రికెట్‌ జట్టులో చోటు దక్కినంత సంబరంగా ఉంది. త్వరలో ఆ అవకాశమూ దక్కుతుందని ఆశతో ఉన్నా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు