WI vs IND: మరో 45 పరుగులు చేస్తే.. యశస్వి ఖాతాలో అరుదైన ఘనత!

విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీతో కదం తొక్కాడు. ఇలా అరంగేట్రంలోనే శతకం బాదిన 17వ భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే, ఇంకొన్ని పరుగులు చేస్తే పదేళ్లుగా ఉన్న రికార్డు బద్దలు కావడంతోపాటు తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు.

Published : 14 Jul 2023 10:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అరంగేట్ర టెస్టులోనే భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. విండీస్‌ గడ్డపై (WI vs IND) వారి బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొని పరుగులు చేస్తున్న యశస్వి మరో అరుదైన ఘనతను సాధించేందుకు కొద్ది దూరంలో మాత్రమే ఉన్నాడు. ప్రస్తుతం 143 పరుగులతో కొనసాగుతున్న యశస్వి.. మరో 45 పరుగులు చేస్తే భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో భారత సీనియర్‌ ఆటగాడు శిఖర్ ధావన్‌ (187) ఉన్నాడు. అతడి తర్వాత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ (177) ఉన్నాడు. యశస్వి 57 పరుగులు జోడిస్తే భారత క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు డెబ్యూ చేసిన మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు అవకాశం ఉంది. 

సచిన్, గిల్‌ను అధిగమించి.. 

విండీస్‌తో టెస్టు అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్  ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్, యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ను అధిగమించాడు. అతడు టెస్టు డెబ్యూ చేసేనాటికి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో సగటు విషయంలో వారిద్దరిని యశస్వి దాటేశాడు. సచిన్‌ 70.18 సగటుతో 9 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన తర్వాత టెస్టుల్లోకి వచ్చాడు. ఇక గిల్ 68.78 సగటుతో 23 మ్యాచ్‌లు ఆడాక అవకాశం దక్కింది. ఇప్పుడు యశస్వి 15 మ్యాచుల్లో 80.21 సగటుతో ఆడి టెస్టుల్లోకి అడుగు పెట్టాడు. అయితే,  ఈ విభాగంలో మాజీ క్రికెటర్లు వినోద్ కాంబ్లి (27 మ్యాచ్‌లు, 88.37 సగటు), ప్రవీణ్‌ ఆమ్రె (23 మ్యాచ్‌లు, 81.23 సగటు) అందరి కంటే ముందున్నారు.

ఇదీ చదవండి..  నీ సెంచరీ వెనుక ఎన్నో కష్టాలు..

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. విండీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్‌.. బ్యాటింగ్‌లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. రెండు రోజుల ఆట ముగిసిన తర్వాత టీమ్ఇండియా 312/2 స్కోరుతో కొనసాగుతోంది. క్రీజ్‌లో యశస్వి జైస్వాల్ (143*), విరాట్ (36*) ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని