Ind-Kiwis: భారత్‌తో టీ20 సిరీస్‌కు కేన్‌ దూరం.. కివీస్‌కు కొత్త కెప్టెన్‌

యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ ఆడిన కివీస్‌ నేరుగా టీమ్‌ఇండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది....

Published : 16 Nov 2021 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నవంబర్ 17 (బుధవారం) నుంచి న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ ఆడిన కివీస్‌ నేరుగా భారత్‌కు వచ్చేసింది. టీమ్‌ఇండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. అయితే భారత్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు జట్టు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. మళ్లీ నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు కేన్‌ జట్టులో చేరతాడు. ‘‘కివీస్‌ కెప్టెన్ కేన్‌ ఈ వారం అందుబాటులో ఉండడు. నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు సన్నద్ధత కోసం విశ్రాంతి తీసుకుంటాడు. అందుకే మూడు టీ20ల సిరీస్‌కు దూరం కానున్నాడు’’ అని న్యూజిలాండ్ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. దీంతో టిమ్‌ సౌథీ నాయకత్వంలోని టీ20 జట్టును కివీస్‌ క్రికెట్ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకున్న కివీస్‌.. ఆసీస్‌ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే.

‘‘బుధవారం నుంచి ప్రారంభమయ్యే  టీ20 సిరీస్‌కు టిమ్‌ సౌథీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కేల్‌ జేమీసన్, డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ సాట్నర్ రెండు ఫార్మాట్ల సిరీస్‌లకు అందుబాటులో ఉంటారు. లాకీ ఫెర్గూసన్‌ వేగంగా కోలుకుంటున్నాడు. టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నాం’’ అని న్యూజిలాండ్ క్రికెట్‌ బోర్డు తెలిపింది. కివీస్‌-భారత్‌ జట్ల మధ్య జయపుర వేదికగా నవంబర్ 17న తొలి టీ20, రాంచీ మైదానంలో నవంబర్ 19న రెండో టీ20, కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా 21 (ఆదివారం) ఆఖరి టీ20 మ్యాచ్‌ జరగనుంది. తొలి టెస్టు నవంబర్ 25-29, రెండో టెస్టు డిసెంబర్ 3-7 వరకు జరుగుతాయి. సోమవారం సాయంత్రం జయపురకు చేరుకున్న న్యూజిలాండ్‌ జట్టు ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. మరోవైపు టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్సీని వదిలిపెట్టిన విరాట్‌ కోహ్లీ సిరీస్‌కూ అందుబాటులో ఉండడు. విరాట్‌ బదులు రోహిత్‌ శర్మను టీ20 సారథిగా బీసీసీఐ నియమించింది. 

న్యూజిలాండ్‌ టీ20 జట్టు : టాడ్‌ ఆస్టల్‌, ట్రెంట్ బౌల్ట్‌, మార్క్‌ చాంపన్‌, లాకీ ఫెర్గూసన్‌, మార్టిన్‌ గప్తిల్, కేల్‌ జేమీసన్‌, ఆడమ్‌ మిల్నే, డారిల్ మిచెల్‌, జిమ్మీ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్, మిచెల్‌ సాట్నర్, టిమ్‌ సీఫర్ట్, ఐష్ సోధి, టిమ్‌ సౌథీ (కెప్టెన్)

భారత్‌ జట్టు: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, చాహల్‌, ఆర్‌.అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, అవేష్‌ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని