Kolkata vs Hyderabad: హైదరాబాద్‌ ఘోర ఓటమి.. ఐపీఎల్‌ టైటిల్‌ కోల్‌కతాదే

ఐపీఎల్‌ 17వ సీజన్‌ విజేతగా కోల్‌కతా ఆవతరించింది. చెన్నై వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.  

Updated : 27 May 2024 00:52 IST

చెన్నై: ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఫైనల్‌లో కోల్‌కతా విజయఢంకా మోగించింది. చెన్నై వేదికగా జరిగిన తుదిసమరంలో హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కోల్‌కతా ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2012, 2014లోనూ కేకేఆర్‌ ఐపీఎల్ విజేతగా నిలిచింది. సునీల్ నరైన్ (6) విఫలమైనా.. వెంకటేశ్‌ అయ్యర్ (52*; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ బాదాడు. రెహ్మనుల్లా గుర్బాజ్‌ (39; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో కమిన్స్‌, షాబాజ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

తేలిపోయిన హైదరాబాద్‌

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ పూర్తిగా తేలిపోయింది. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (2), హెడ్‌ (0), తొలి డౌన్‌లో వచ్చిన రాహుల్‌ త్రిపాఠి (9) పూర్తిగా విఫలమయ్యారు. రెండో డౌన్‌లో వచ్చిన మార్‌క్రమ్‌ (20), నితీశ్‌ రెడ్డి (13)తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. క్రీజులో నిలదొక్కుకుంటున్నట్లు కనిపించిన.. ఈ జోడీని హర్షిత్‌ రాణా విడగొట్టాడు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద గుర్బాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి నితీశ్‌రెడ్డి వెనుదిరిగాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే మార్‌క్రమ్‌ కూడా రసెల్‌ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వారిలో కెప్టెన్‌ కమిన్స్‌ (24) మినహా మిగతావారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో రసెల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్‌, హర్షిత్‌ రాణా చెరో 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, నరైన్‌, వైభవ్‌ అరోరా తలో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని