MS Dhoni: ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్‌కు కారణమిదే!

‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్‌ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్‌లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 28 Apr 2024 15:31 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17 సీజన్లలో విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది మంది క్రికెటర్లలో ఎంఎస్ ధోనీ (MS Dhoni) ముందుంటాడు. చెన్నై జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడానికి కూడా కారణం అతడే. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన సారథి. ప్రస్తుతం 42 ఏళ్ల వయసులోనూ మునుపటి ‘ఫినిషింగ్‌’ టచ్‌ ఇస్తున్న ధోనీ సక్సెస్‌ వెనుక కారణం ఏంటా? అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. గతంలో స్వయంగా అతడే వెల్లడించిన పాత వీడియోను ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్‌ స్పోర్ట్స్‌ షేర్ చేసింది. 

‘‘ఇప్పుడు నేను చెప్పే సమాధానం కొందరికి అసంబద్ధంగా ఉండొచ్చేమో. కానీ, చాన్నాళ్లుగా నేను ఫాలో అవుతున్న టైమ్‌ టేబుల్‌ ఇదే. అదే నాకు సాయంగా నిలిచింది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ఐదారు రోజుల ముందు నుంచే మానసికంగా సిద్ధమవుతా. ఒక్కోసారి రాత్రి 12 తర్వాత మేం మళ్లీ ఫ్లైట్‌ను అందుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతిసారి నేను ఆలస్యంగా నిద్ర పోవాల్సిన పరిస్థితి. మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కిట్ బ్యాగ్‌ను సిద్ధం చేసుకోవాలి. ఆలస్యంగా డిన్నర్‌ చేయాలి. దీంతో హోటల్‌ గదికి చేరుకునే సరికి ఒక్కోసారి 1.15 అయిపోతుంది. అక్కడ వస్తువులను ప్యాక్‌ చేసుకోవాలి. దీంతో 2.30 అయిపోతుంది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటలకు పడుకొని ఆరింటికల్లా నిద్రలేస్తుంటారు. నేను మాత్రం 3 గంటలకు పడుకొని ఉదయం 11 గంటలకు లేస్తా. కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకుంటా. మ్యాచ్‌లు లేనప్పుడు సరైన సమయానికి పడుకొంటా. కాబట్టి, ఐపీఎల్ ముగిసినా నాకు అలసట అనిపించదు’’ అని ధోనీ తెలిపాడు. 

హైదరాబాద్‌తో చెన్నై ఢీ

ఐపీఎల్ 17వ సీజన్‌లో హైదరాబాద్‌తో తన సొంతమైదానం చెపాక్‌లో చెన్నై తలపడనుంది. ఉప్పల్ మ్యాచ్‌లో చెన్నైకు ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై భావిస్తోంది. మరోవైపు ప్లేఆఫ్స్ రేసులో హైదరాబాద్‌ మూడో స్థానంలో (10 పాయింట్లు), చెన్నై (8 పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడీ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలిస్తే రెండో స్థానంలోకి వెళ్తుంది. చెన్నై కూడా భారీ విజయం సాధిస్తే సెకండ్‌ ప్లేస్‌లోకి వచ్చే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని