ODI World Cup 2023: కపిల్‌ దేవ్‌ కిడ్నాప్‌.. వీడియోతో సహా పోస్టు చేసిన గంభీర్‌..!

భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించిన కపిల్‌దేవ్‌ అపహరణకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను మాజీ బ్యాటర్‌ గౌతమ్‌ గంభీర్‌ నిన్న ట్విటర్‌లో పోస్టు చేశారు. కానీ, నేడు కపిల్‌ను కిడ్నాప్‌ చేయడానికి కారణాలతో సహా ఉన్న వీడియోను అభిమానులతో పంచుకొన్నారు. అదేంటో వీక్షించండి..!  

Published : 26 Sep 2023 15:35 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లో అక్టోబర్‌ నుంచి ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) ప్రారంభమవుతున్న వేళ మాజీ సూపర్‌ స్టార్‌ కపిల్‌దేవ్‌ (Kapil Dev) కిడ్నాప్‌నకు గురయ్యారు. ఈ విషయాన్ని మాజీ బ్యాటర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) వీడియోతో సహా ట్విటర్‌లో సెప్టెంబర్‌ 25 తేదీన పోస్టు చేశారు. దీనిలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కపిల్‌దేవ్‌ చేతులు బంధించి.. నోటికి గుడ్డ కట్టి బలవంతంగా లాక్కెళుతున్నట్లు ఉంది. ‘‘ఎవరికైనా ఈ క్లిప్‌ వచ్చిందా. ఇది నిజమైన కపిల్‌దేవ్‌ కాదని ఆశిస్తున్నాను. కపిల్‌ క్షేమంగానే ఉంటారని భావిస్తున్నాను’’ అని ఆయన సోమవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో అభిమానులు కూడా నిజమైన వీడియోనా.. వాణిజ్య ప్రకటనల్లో భాగమా అని తికమకపడ్డారు. 

ఆ తర్వాత అది ప్రపంచకప్‌ ప్రసారాలకు సంబంధించిన ప్రోమో చిత్రీకరణలోని దృశ్యాలని తేలింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ గంభీర్‌ నేడు మరోసారి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘అరే కపిల్‌జీ బాగా ఆడారు! యాక్టింగ్‌లో కూడా ప్రపంచకప్‌ ఉంటే మీరే గెలిచేస్తారు. ఐసీసీ మెన్స్‌ వరల్డ్‌కప్‌ మొబైల్‌ డిస్నిప్లస్‌ హాట్‌స్టార్‌లో ఫ్రీ అని ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోను కూడా ఆయన జత చేశారు. ఈ సారి ప్రపంచకప్‌ మ్యాచ్‌లు డిస్నిప్లస్‌ హాట్‌స్టార్‌లో పూర్తిగా ఉచితంగా చూడవచ్చు. అది కూడా డేటాసేవర్‌ మోడ్‌లో లభిస్తుంది. ఈ విషయాన్ని డిస్నిప్లస్‌ హాట్‌స్టార్‌ కూడా ధ్రువీకరించింది. 

లోడ్.. ఎయిమ్.. షూట్... ప్రపంచకప్ ముంగిట సమసిపోతున్న భారత్‌ సమస్యలు

భారత్‌కు కపిల్‌ బృందం 1983లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను అందించింది. ఆ తర్వాత క్రికెట్‌లో కపిల్‌ సూపర్‌ స్టార్‌గా మారారు. కెరీర్‌లో 131 టెస్టులు ఆడి 5,248 పరుగులు, 438 వికెట్లు పడగొట్టారు. ఇక వన్డేల్లో 225 మ్యాచ్‌లు 3,783 పరుగులు, 253 వికెట్లు సాధించారు. 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై ఆయన చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్‌ భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని