Rohit Sharma: విండీస్ పర్యటన నుంచి రోహిత్‌కు విశ్రాంతి ఇస్తారా?

వరుసగా మ్యాచ్‌లు ఆడి అలసిపోయిన భారత ఆటగాళ్లు దాదాపు నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారు. జులై 12 నుంచి విండీస్‌ పర్యటన ప్రారంభం కానుంది. అయితే, అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కొన్ని రోజుల ముందే ప్లేయర్లు అక్కడికి వెళ్లనున్నారు. కానీ, టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం వెళ్లకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

Published : 16 Jun 2023 17:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final 2023)లో ఓటమితో కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వ్యక్తిగత ప్రదర్శనలోనూ విఫలం కావడంతో ఆ విమర్శల వేడి ఇంకా పెరిగింది. ఈ క్రమంలో వచ్చేనెల 12 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్‌ పర్యటన (WI vs IND) కోసం రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో టెస్టు సిరీస్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా అజింక్య రహానె వ్యవహరిస్తాడని సమాచారం.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిసిన తర్వాత నెల రోజులపాటు భారత ఆటగాళ్లకు విరామం దొరికింది. జులై 12 నుంచి విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత్‌ వెళ్లనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మూడో సీజన్‌ కూడా విండీస్‌తో టెస్టు సిరీస్‌ నుంచే టీమ్‌ఇండియాకు ప్రారంభం కానుంది. ఇంకా జట్టును ప్రకటించాల్సి ఉంది.

‘‘విండీస్ పర్యటన నుంచి రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్‌ వరుసగా ఆడటంతో రోహిత్ అలసటగా ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ కానీ వన్డేలు, టీ20ల నుంచి గానీ విశ్రాంతి తీసుకొనే అవకాశం లేకపోలేదు. అయితే, రోహిత్‌తో చర్చించిన అనంతరమే సెలెక్షన్ కమిటీ నిర్ణయిం తీసుకొంటుంది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 15 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేశాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు రోహిత్ శుభారంభం అందించడానికి ప్రయత్నించాడు. అయితే, కీలక సమయంలో పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని