Shubman Gill: ఎలా ఆడాలనేది అతడు చెప్పాడు.. వారి వల్లే మా విజయం: శుభ్‌మన్‌ గిల్

ఓ మోస్తరు స్కోరును కాపాడుకొని గుజరాత్ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హార్దిక్‌ పాండ్య నాయకత్వంలోని ముంబయి ఓటమిపాలైంది.

Published : 25 Mar 2024 10:52 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐదు సార్లు ఛాంపియన్‌ ముంబయిపై గుజరాత్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ హార్దిక్‌ నాయకత్వంలో ముంబయి జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి బంతి వరకూ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ పోరాటం ఆకట్టుకుంది. ఒక దశలో ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో గుజరాత్‌ బౌలర్లు పుంజుకున్న తీరు అద్భుతం. మరీ ముఖ్యంగా పేసర్లతోపాటు స్పిన్నర్ల వల్లే విజయం సాధించగలిగామని గుజరాత్‌ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్‌లో మరో 15 పరుగులు చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. 

‘‘మంచు ప్రభావం ఉన్న సమయంలోనూ మా బౌలర్లు అదరగొట్టారు. ముంబయి బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగారు. స్పిన్నర్ల వల్లే రేసులో నిలవగలిగాం. పేసర్లూ కీలకమైన సమయంలో రాణించి వికెట్లు తీసి గెలిపించారు. ముంబయి బ్యాటర్లు పొరపాట్లు చేసేవరకు వేచి చూశాం. అయితే, మేం బ్యాటింగ్‌లో మరో 15 పరుగులు చేయాల్సింది. సాయి సుదర్శన్‌ మాకు బ్యాటింగ్‌ ఎలా చేయాలో చేసి చూపించాడు. స్కోరు బోర్డుపై మంచి లక్ష్యమే నిర్దేశించగలిగాం. మా జట్టును ప్రోత్సహించడానికి అభిమానులు భారీ సంఖ్యలో రావడం ఆనందంగా ఉంది. ప్రతిసారీ మద్దతు అద్భుతం. ఇదే ఆటతీరును మున్ముందు మ్యాచుల్లో ప్రదర్శించి విజయాలు సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అని గిల్ వ్యాఖ్యానించాడు. 

అక్కడ వెనుకబడ్డాం: హార్దిక్‌ పాండ్య

‘‘లక్ష్య ఛేదనలో దగ్గరగా వచ్చాం. కానీ, చివరి 42 పరుగులు చేసే క్రమంలో ఒక్కసారిగా తడబాటుకు గురయ్యాం. ఐదు ఓవర్లలోనే పూర్తి చేయాల్సింది. కానీ, చివరి ఓవర్‌ వరకూ తీసుకెళ్లి మ్యాచ్‌ను చేజార్చుకున్నాం. అహ్మదాబాద్‌ స్టేడియానికి రావడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు భారీ సంఖ్యలో మ్యాచ్‌ను చూడటానికి వస్తారు. రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో తిలక్‌ వర్మ సింగిల్‌ తీయకపోవడం మంచి నిర్ణయమే. అతడికి నా మద్దతు ఉంది. ఈ టోర్నీలో ఇంకా 13 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తప్పకుండా ఛాంపియన్‌ గేమ్‌ ఆడేందుకు ప్రయత్నిస్తాం’’ అని ముంబయి కెప్టెన్ హార్దిక్‌ పాండ్య తెలిపాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో ఆడటం చాలా కష్టమైంది: సాయి సుదర్శన్‌

‘‘ఛేదనతో పోలిస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఆడటం చాలా కష్టంగా ఉందనిపించింది. మంచు ప్రభావం వల్ల ముంబయి బ్యాటర్లు కొన్ని షాట్లు కొట్టేందుకు అవకాశం ఉంది. అయితే, మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసేటప్పుడు జట్టు విజయం కోసం అవసరమైన పరుగులు రాబడితే చాలనుకున్నా. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌తో కీలక పాత్ర పోషించిన బౌలర్లు ఉన్నారు. అనూహ్యంగా నాకు ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కడం ఆశ్యర్యంగా ఉంది’’ అని సాయి సుదర్శన్‌ పేర్కొన్నాడు. గుజరాత్ 168 పరుగులు చేయడంలో సాయి కీలక పాత్ర పోషించాడు. 39 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. దీంతో అతడికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని