Team India captaincy: అప్పుడు కోహ్లీని కోరలేదు.. రోహిత్‌ బెస్ట్‌ అనిపించాడు: గంగూలీ

వన్డే ప్రపంచకప్‌లో (ODI WORLD CUP 2023) భారత్‌ రాణిస్తుందనే నమ్మకం ఉందని.. రోహిత్ శర్మ సారథ్యంలో విజేతగా నిలుస్తామని మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేర్కొన్నాడు. అలాగే, విరాట్ కెప్టెన్సీ వ్యవహారంపైనా స్పందించాడు.

Updated : 13 Jun 2023 12:30 IST

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ మూడు టెస్టుల సిరీస్‌ను 1-2 తేడాతో ఓడిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పటికే కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతలను వదిలేయగా.. వన్డే కెప్టెన్సీకి బీసీసీఐ దూరం చేసింది. దక్షిణాఫ్రికాపై ఓటమితో టెస్టు సారథ్యానికీ విరాట్ కోహ్లీ (Virat Kohli) గుడ్‌బై చెప్పేశాడు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతో విభేదాలు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇరువురి మధ్య మాటల యుద్ధం కూడా చోటుచేసుకుంది. ఇటీవల ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఓ మ్యాచ్‌ సందర్భంగా గంగూలీతో కరచాలనం చేయడానికి కూడా విరాట్ విముఖత ప్రదర్శించాడు. అయితే, ఐపీఎల్‌లో బెంగళూరు - దిల్లీ చివరి లీగ్‌ మ్యాచ్‌ సందర్భంగా వీరిద్దరూ కలవడంతో ఆ వివాదానికి తెరపడినట్లైంది. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సందర్భంగానూ విరాట్‌తో గంగూలీ చిట్‌చాట్‌ చేశాడు. 

భారత్‌ వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓటమిని చవిచూసింది. దీంతో టెస్టు కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించాలనే డిమాండ్లూ వచ్చాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగడంపై మరోసారి గంగూలీ స్పందించాడు. అలాగే, బీసీసీఐ ఎప్పుడూ కూడా టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని విరాట్‌ను కోరలేదని కూడా స్పష్టం చేశాడు. ‘‘విరాట్ టెస్టు కెప్టెన్సీని త్యజించినప్పుడు బీసీసీఐ సన్నద్ధంగా కూడా లేదు. దక్షిణాఫ్రికా సిరీస్‌ తర్వాత అలా ఎందుకు చేశాడో నాకైతే తెలియదు. కేవలం కోహ్లీ మాత్రం చెప్పగలడు. అయితే, విరాట్‌ కెప్టెన్సీని వదిలేసిన తర్వాత రోహిత్‌ శర్మనే సరైన ఎంపికగా మేం భావించాం. ఆ సమయంలో అతడే కరెక్ట్‌ అనిపించింది. విరాట్ అద్భుతమైన నాయకుడు. రవిశాస్త్రి-విరాట్ ఆధ్వర్యంలో టీమ్‌ఇండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. ఇంగ్లాండ్‌, ఆసీస్‌ గడ్డపై నిర్భయంగా క్రికెట్‌ ఆడారు’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. 

అది పెద్ద కష్టమేం కాదు

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడి ఐసీసీ ట్రోఫీని దూరం చేసుకున్నప్పటికీ.. వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ సారథ్యంలోని భారత్‌ తప్పకుండా రాణిస్తుందనే నమ్మకం ఉందని గంగూలీ తెలిపాడు. ‘‘రోహిత్ నాయకత్వంలో ముంబయి ఐదు ఐపీఎల్‌ టైటిళ్లను గెలిచింది. రోహిత్‌పై పూర్తి నమ్మకం ఉంది. అతడు, ధోనీ మాత్రమై ఐదేసి కప్‌లను గెలిచారు. ఐపీఎల్‌ టోర్నీలో విజేతగా నిలవడం చాలా కష్టమే. పద్నాలుగేసి లీగ్‌ మ్యాచ్‌లు, ప్లేఆఫ్స్‌ ఆడి మరీ ఛాంపియన్‌గా నిలవాలి. అదే, ప్రపంచ కప్‌లో నాలుగైదు విజయాలు సాధిస్తే సెమీస్‌కు వెళ్లిపోవచ్చు. అందుకే, ప్రపంచకప్‌ను గెలవడం కంటే ఐపీఎల్‌ విజేతగా నిలవడమే కష్టమని చెబుతా’’ అని గంగూలీ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు