T20 World Cup: నంబర్‌ 6 ర్యాంకర్‌కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్‌ పఠాన్

ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు.

Published : 02 May 2024 12:45 IST

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్ఏ-విండీస్‌ సంయుక్త ఆతిథ్యంలో జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లను ఆయా బోర్డులు ప్రకటించాయి. భారత స్క్వాడ్‌ను కూడా బీసీసీఐ వెల్లడించింది. అప్పటి నుంచి జట్టు ఎంపికపై విమర్శలు రావడం ప్రారంభమయ్యాయి. రింకు సింగ్‌ను తీసుకోకపోవడంపై మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. ఇప్పుడు స్టార్‌ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేయడంపై ఇర్ఫాన్‌ పఠాన్ పోస్టు పెట్టాడు. అలాగే ఐపీఎల్‌లో చెన్నై జట్టు సారథి రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంచుకుంటే బాగుండేదని క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ఐసీసీ టీ20 ర్యాంకుల్లో ఆరో స్థానం సాధించిన క్రికెటర్ వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక కాకపోతే.. ఆ బాధను దిగమింగడం కూడా చాలా కష్టం. ఇప్పుడు రవి బిష్ణోయ్‌ పరిస్థితి కూడా ఇలానే ఉంది’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్ల కోటాలో కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌ను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో బిష్ణోయ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. 

ప్రత్యేక అభిమానం ఎందుకో?: క్రిష్‌

రింకు సింగ్‌ను 15 మంది జట్టులో ఎంపిక చేయకపోవడంపై తీవ్రంగా స్పందించిన భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్.. గిల్‌ను రిజర్వ్‌ ప్లేయర్‌గా తీసుకోవడంపైనా విమర్శించాడు. కనీసం రుతురాజ్‌నైనా తీసుకోలేకపోవడం దారుణమని వ్యాఖ్యానించాడు. ‘‘శుభ్‌మన్ గిల్ అసలు ఫామ్‌లోనే లేడు. అతడిని ఎందుకు ఎంపిక చేశారు. రుతురాజ్‌ గైక్వాడ్‌కు పూర్తి అర్హత ఉంది. గత 17 ఇన్నింగ్స్‌ల్లో అతడు 500+ పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియాపైనా సెంచరీ చేశాడు. అయితే, గిల్‌ పట్ల సెలక్టర్లు ఆసక్తి చూపడానికి కారణమేంటో తెలియడం లేదు. అతడు విఫలమైనా సరే టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అతడికి అవకాశం దక్కుతుంది. జట్టు ఎంపిక అంతా అభిమానంతో కూడుకున్నట్లుగా ఉంది’’ అని క్రిష్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని