WI vs IND: చెలరేగిన సూర్యకుమార్‌.. మూడో టీ20లో భారత్‌ విజయం

సిరీస్‌ పోరులో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. సూర్యకుమార్‌ యాదవ్‌(83), తిలక్‌ వర్మ(49*) చెలరేగడంతో భారత్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated : 09 Aug 2023 00:01 IST

గయానా: విండీస్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మూడో టీ20లో టీమ్‌ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అరంగేట్ర ఆటగాడు యశస్వి జైస్వాల్ (1)తోపాటు శుభ్‌మన్‌ గిల్ (6) విఫలమైనా.. సూర్యకుమార్‌ యాదవ్ (83; 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) విండీస్‌ బౌలర్లపై పిడుగల్లే విరుచుకుపడ్డాడు. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (49*; 37 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్‌) అర్ధ శతకానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. హార్దిక్‌ పాండ్య (20) నాటౌట్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో జోసెఫ్‌ 2, మెకాయ్‌ ఒక వికెట్ పడగొట్టారు. 

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.  ఓపెనర్‌ బ్రాండన్ కింగ్ (42; 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా.. చివర్లో రోవ్‌మన్ పావెల్ (40*; 19 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. కైల్ మేయర్స్ (25; 20 బంతుల్లో), నికోలస్ పూరన్ (20; 12 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు.  భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్ 3, అక్షర్‌ పటేల్, ముకేశ్‌ కుమార్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని