WI vs IND: వారి ప్రదర్శనపైనే దృష్టి.. ఈసారి హార్దిక్‌ నిర్ణయాలు ఎలా ఉంటాయో?

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో (WI vs IND) భారత్ 0-2 తేడాతో వెనుకబడి ఉంది. వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడి సిరీస్‌ను ప్రమాదంలో పడేసింది. మూడో టీ20లోనైనా గెలిచి రేసులో నిలవాలి.

Published : 08 Aug 2023 14:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2023) కోసం జట్టును సిద్ధం చేయడంపై దృష్టిపెట్టిన భారత్‌కు (Team India) ఏదీ కలిసిరావడం లేదు. ఆటగాళ్ల ఎంపిక నుంచి వారిని సరిగ్గా వినియోగించుకోవడం వరకు తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వెస్టిండీస్‌తో పొట్టి సిరీస్‌లోనూ భారత ప్రదర్శన నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిసారే గుజరాత్‌ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్య (Hardik Pandya).. విండీస్‌తో సిరీస్‌లో తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం విమర్శలకు దారితీసింది. ఇప్పుడు మూడో మ్యాచ్‌లోనైనా లోటుపాట్లను సరి చేసుకుని బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. లేకపోతే సిరీస్‌ రేసు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. 

గిల్ - సంజూ పరిస్థితేంటి? 

మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియాకు కీలక బ్యాటర్‌గా ఎదిగిన శుభ్‌మన్‌ గిల్ విండీస్‌తో టీ20 సిరీస్‌లో మాత్రం తేలిపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో 3, రెండో టీ20లో 7 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ తన అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. సంజూ శాంసన్‌ కూడా 12, 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక రిజర్వ్‌ బెంచ్‌పై యశస్వి మాత్రమే బ్యాటర్. దీంతో గిల్ - సంజూలో ఒకరిని పక్కన పెట్టేసి యశస్వికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఇషాన్, సూర్యకుమార్‌ కూడా తన స్థాయి ఆటతీరును ప్రదర్శించడం లేదు. యువ ఆటగాడు తిలక్ వర్మ మాత్రమే అదరగొట్టేశాడు. 

హార్దిక్‌.. ఎందుకు ఇలా?

నాణ్యమైన బౌలింగ్‌ వేస్తున్న యుజ్వేంద్ర చాహల్‌తో పూర్తి ఓవర్లను వేయించలేదు. అక్షర్ పటేల్‌ను తీసుకున్నప్పటికీ అతడికి బౌలింగ్‌ ఇవ్వలేదు. మరోవైపు గొప్పగా రాణించలేకపోతున్న ముకేశ్‌ కుమార్‌తో మాత్రం బౌలింగ్‌ చేయించాడు. రిజర్వ్‌ బెంచ్‌లో తన అవకాశం కోసం ఎదురు చూస్తున్న అవేశ్‌ ఖాన్‌ను ఆడిస్తే ఏమైనా మార్పు ఉండొచ్చు. హార్దిక్ కూడా వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులను నియంత్రించడంలో విఫలం కావడం గమనార్హం. విండీస్‌ బ్యాటర్లలో నికోలస్‌ పూరన్, రోవ్‌మన్‌ పావెల్ మరింత ప్రమాదకారులు. వారిని ఔట్ చేసేందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని మిస్‌ చేయకూడదు. అయితే, రెండో టీ20లో బిష్ణోయ్ బౌలింగ్‌లో రోవ్‌మన్‌ ఎల్బీ  అయ్యేవాడు. కానీ, డీఆర్‌ఎస్‌ తీసుకోవడంలో భారత్ విఫలమైంది. కెప్టెన్‌గా హార్దిక్ తన బౌలర్లపై కాస్త నమ్మకం ఉంచి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. 

పిచ్‌ పరిస్థితి.. మ్యాచ్‌ షెడ్యూల్

రెండో టీ20 మాదిరే ఈ మ్యాచ్‌లోనూ పిచ్‌ మందకొడిగా ఉండే అవకాశం ఉంది. బౌలర్లకే ఎక్కువ  సహకరించొచ్చు. చిన్న బౌండరీలు కావడంతో భారీ షాట్‌లు ఆడటం బ్యాటర్లకు సులభంగా ఉండొచ్చు. మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. జియో సినిమా, ఫ్యాన్‌కోడ్‌ ఓటీటీల్లో వీక్షించే అవకాశం ఉంది. 

జట్లు (అంచనా):

భారత్‌: ఇషాన్‌, శుభ్‌మన్‌, సూర్యకుమార్‌, తిలక్‌, శాంసన్‌, హార్దిక్‌, అక్షర్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, చాహల్‌, అవేష్‌ ఖాన్‌ 

వెస్టిండీస్‌: కింగ్‌, మేయర్స్‌, ఛార్లెస్‌, పూరన్‌, పావెల్‌, హెట్‌మయర్‌, షెఫర్డ్‌, హోల్డర్‌, అకీల్‌, అల్జారి జోసెఫ్‌, మెకాయ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని