ICC Hall Of Fame: హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో మరో ముగ్గురికి చోటు

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి కొత్తగా మరో ముగ్గురు మాజీ క్రికెటర్లు స్థానం సంపాదించారు.  

Published : 14 Nov 2021 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి కొత్తగా మరో ముగ్గురు మాజీ క్రికెటర్లు స్థానం సంపాదించారు. శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్దనె, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ షాన్‌ పొలాక్‌, ఇంగ్లాండ్‌ మాజీ బ్యాటర్‌ జెనెట్‌ బ్రిటిన్‌కు స్థానం దక్కింది. క్రికెట్‌కు అందించిన సేవలకుగాను హాల్‌ ఆఫ్ ఫేమ్‌ జాబితాలోకి ఐసీసీ చోటు కల్పిస్తుంది. 2009లో ప్రారంభించిన ఐసీసీ హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో ఇప్పటి వరకు కొత్తగా ముగ్గురితో కలిపి దాదాపు 106 మంది క్రీడాకారులు చోటు సంపాదించారు. 2014లో టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంక నెగ్గడంలోనూ.. నాలుగు ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌కు చేరడంలో మహేల జయవర్దనే (1997-2015) కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా తరఫున ఆడిన షాన్‌ పొలాక్‌ (1995-2008) అద్భుతమైన ఆల్‌రౌండర్‌. టెస్టులు, వన్డేల్లో వేర్వేరుగా మూడు వేల పరుగులు, మూడు వందలకుపైగా వికెట్లను పడగొట్టిన అరుదైన ఆటగాడు. ఇక ఇంగ్లాండ్‌కు చెందిన జెనెట్‌ బ్రెటిన్‌ (1979-98) దాదాపు 19 ఏళ్లపాటు క్రికెట్‌కు సేవలందించారు. అయితే 2017లో జెనెట్‌ మరణించింది.

జెనెట్‌కు గౌరవం దక్కడంపై ఆమె స్నేహితురాలు ఏంజెలా బైన్‌బ్రిడ్జ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి ధన్యవాదాలు తెలిపింది. హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలోకి చేరడంపై మహేల జయవర్దనె, షాన్‌ పొలాక్‌ స్పందించారు. ‘‘ఈ గుర్తింపునకు చాలా రుణపడి ఉంటా. నాతోపాటు ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కుటుంబం, స్నేహితులు, కోచ్‌లు, జట్టు సభ్యులు, శ్రీలంక క్రికెట్‌ అభిమానుల వల్లే ఇది సాధ్యమైంది. కెరీర్ ఆసాంతం వెన్నంటి ఉండి ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు’’ అని జయవర్దనె  పేర్కొన్నాడు.  హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి స్థానం సంపాదించడం అద్భుతమైన గౌరవంగా ఉందని షాన్‌ పొలాక్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని