WI vs IND: త్వరలోనే కొత్త పాత్రలోకి యువ బ్యాటర్లు: భారత బౌలింగ్‌ కోచ్ పరాస్ మాంబ్రే

వెస్టిండీస్‌ పర్యటనలో (WI vs IND) యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి క్రమంలో కొత్త బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత బౌలింగ్ కోచ్‌ తెలిపాడు.

Published : 12 Aug 2023 15:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌ పర్యటనలో (WI vs IND) భారత్ విభిన్న ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. యువకులతో కూడిన జట్టుతోనే టీ20 సిరీస్ ఆడుతోంది. యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ అరంగేట్రం చేశారు. మూడు మ్యాచుల్లోనూ తిలక్ అదరగొట్టే ప్రదర్శన ఇచ్చాడు. ఇవాళ ఫ్లోరిడా వేదికగా నాలుగో టీ20 మ్యాచ్‌  జరగనుంది. సిరీస్‌ రేసులో నిలవాలంటే భారత్‌ తప్పనిసరిగా విజయం సాధించాలి. ఈ క్రమంలో భారత బౌలింగ్‌ కోచ్ పరాస్ మాంబ్రే ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ క్రికెటర్లతో సరికొత్త బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొన్నాడు. 

‘‘ప్రతి ఒక్కరూ విభిన్నంగా తమ సామర్థ్యాలను ప్రదర్శించడం అభినందనీయం. అండర్ 19 రోజుల నుంచే తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ బౌలింగ్‌ చేయడం చూస్తున్నా. బౌలింగ్‌లోనూ రాణించగల సత్తా వారిద్దరిలో ఉంది. ఒక దశలో దానిపైనా కష్టపడ్డారు. బౌలింగ్‌ ఆప్షన్లు ఎక్కువగా ఉంటే జట్టుకు చాలా ఉపయోగాలు. తప్పకుండా వారిద్దరి బౌలింగ్‌ను త్వరలోనే చూస్తామని భావిస్తున్నా. కనీసం మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌ వేసినా చాలు. 

Prithvi shaw: పృథ్వీ!.. ప్రతిభ ఉంటే సరిపోతుందా..?

విండీస్‌ పర్యటనలోనే అరంగేట్రం చేసిన ముకేశ్‌ కుమార్ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలోనూ ఆడే అవకాశం చాలా మందికి రాదు. నాకు తెలిసి అతడు రెండో బౌలర్ అనుకుంటా. ముకేశ్‌ బౌలింగ్‌ వేసే విధానం అద్భుతం. క్లిష్లమైన వికెట్లు, ప్రత్యర్థిపై అరంగేట్రం చేసి రాణించడం సులువేం కాదు. దేశవాళీ క్రికెట్ ఎక్కువగా ఆడిన ముకేశ్‌ వర్క్‌లోడ్‌ సమతూకంగా ఉండేలా చూస్తాం. 

లాడర్‌ హిల్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బ్యాట్‌ మీదకు బంతికి చక్కగా వస్తుందని భావిస్తున్నా. విండీస్‌లోని పిచ్‌లతో పోలిస్తే భిన్నమైంది. ఇక్కడ నల్లమట్టిని వాడారు. ఇలాంటి మట్టిని ఉత్తర భారతంలోని పిచ్‌ల్లో ఉండటం చూశాం. తప్పకుండా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. మూడో టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ రేసులో నిలవడం ఆనందంగా ఉంది. తప్పకుండా ఇక్కడ జరగనున్న మిగతా రెండింట్లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటాం. తొలి రెండు మ్యాచుల్లోనూ గెలిచే అవకాశాలు వచ్చినప్పటికీ కాస్తలో చేజార్చుకున్నాం’’ అని పరాస్‌ తెలిపాడు. లాడర్‌హిల్స్ వేదికగా రాత్రి 8 గంటలకు భారత్ - విండీస్ జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని