USA vs PAK: వారికి ప్రేక్షకుల మద్దతూ ఎక్కువే.. యూఎస్‌ఏ కెప్టెన్ మోనాంక్

చిన్న జట్టుగా వచ్చిన యూఎస్‌ఏ.. సంచలనం నమోదు చేసిన క్రికెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. పాక్‌కు షాక్‌ ఇచ్చింది.

Published : 07 Jun 2024 14:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ 2024లో (T20 World Cup 2024) తొలి సంచలనం నమోదైంది. బలమైన పాకిస్థాన్‌ను యూఎస్‌ఏ చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. సూపర్ ఓవర్‌ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో అమెరికానే విక్టరీ సాధించింది. బాబర్ అజామ్‌ నాయకత్వంలోని పాకిస్థాన్‌ తమ తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు. పాక్‌పై కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడిన యూఎస్ఏ సారథి మోనాంక్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

అమెరికన్‌ టీమ్‌.. అంత ఈజీ కాదు!

‘‘మేం మ్యాచ్‌ను సరైన సమయంలోనే ముగించామని భావిస్తున్నా. అదనంగా సూపర్ ఓవర్‌ ఆడినట్లు అనిపించలేదు. మేం 18 పరుగులు చేయడంతో ఆధిపత్యం ప్రదర్శించేందుకు అవకాశం దక్కింది. దానిని డిఫెండ్‌ చేసుకోవడం కష్టమేం కాదు. మ్యాచ్‌ మధ్యలో సహచరులం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎప్పుడూ ఒత్తిడిగా భావించలేదు. అసలు ఒత్తిడంతా పాక్‌పైనే ఉంటుంది. మాకు ఈసారి అనుకున్నంత మేర మద్దతు లేదని తెలుసు. ప్రేక్షకుల నుంచి పాక్‌కే ఎక్కువ సపోర్ట్ లభించింది. ఇదే ఆ జట్టును దెబ్బతీసింది. మేం నాణ్యమైన క్రికెట్‌ను ఆడటంతో ఇంకాస్త అదనంగా పాక్‌ ఒత్తిడికి గురైంది. తొలి ఆరు ఓవర్లలో మేం బౌలింగ్‌ చేసిన విధానం అద్భుతం. 

పాక్‌కు ‘సూపర్‌’ షాకిచ్చిన ముంబయి ఇంజినీర్‌.. ఎవరీ సౌరభ్‌ నేత్రావల్కర్‌?

పాక్‌తో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాం. వాటిని మైదానంలో అమలుపరిచాం. టాస్‌ నెగ్గగానే తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. తొలి అర్ధభాగం బౌలర్లకు సహకరిస్తుందని మాకు తెలుసు. పవర్‌ ప్లేలోనే కీలకమైన వికెట్లను తీయడంతో పైచేయి సాధించాం. 160 పరుగుల టార్గెట్‌ను సాధించడం పెద్ద కష్టమేం కాదని భావించాం. ఒకవైపు బౌండరీ చిన్నదిగా ఉంటుంది. దానిని సద్వినియోగం చేసుకున్నాం. సౌరభ్, అలీఖాన్, నితీశ్‌.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించారు. చివర్లో అవసరమైతే కోరే అండర్సన్‌ సిద్ధంగా ఉంటాడు. అతడిని చివరి మూడు ఓవర్లలో బ్యాటింగ్‌కు పంపాలని ప్లాన్‌ చేసుకున్నాం. అయితే, పాక్‌ బౌలర్లూ మమ్మల్ని కట్టడి చేయడంతో సూపర్ ఓవర్‌కు మ్యాచ్‌ వెళ్లింది’’ అని మోనాంక్‌ తెలిపాడు. 

సౌరభ్‌ నేత్రావల్కర్‌ టెక్ దిగ్గజం స్పెషల్ పోస్టు

పాకిస్థాన్‌పై యూఎస్‌ఏ విజయం సాధించడంలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 2 వికెట్లు తీసిన సౌరభ్‌ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈసందర్భంగా సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం అతడు ఒరాకిల్‌ (Oracle)లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో ఉంది. ఈక్రమంలో ఒరాకిల్ కూడా స్పెషల్‌ పోస్టు పెట్టింది. ‘‘ యూఎస్‌ఏ క్రికెట్ టీమ్‌కు శుభాకాంక్షలు. జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉంది. మా ఇంజినీర్ - క్రికెట్ స్టార్‌ సౌరభ్‌ అద్భుతంగా ఆడాడు’’ అని పోస్టు పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు