Wrestlers Protest: లైంగిక ఆరోపణల వివాదం.. బ్రిజ్‌ భూషణ్‌పై సుప్రీంకు రెజ్లర్లు

Wrestlers Protest: బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా మరోసారి రోడ్డెక్కిన స్టార్‌ రెజ్లర్లు.. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రంకోర్టును ఆశ్రయించారు.

Updated : 24 Apr 2023 14:44 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan)పై స్టార్‌ రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల వివాదం మరింత ముదురుతోంది. తాజాగా ఇది సుప్రీంకోర్టుకు (Supreme Court) చేరింది. బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ వినేశ్‌ ఫొగాట్‌ (Vinesh Phogat) సహా ఏడుగురు రెజ్లర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను మంగళవారం లిస్ట్‌ చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌.. రెజ్లర్ల తరఫు న్యాయవాదికి సూచించారు. తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ.. బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. అంతేగాక.. ఆయనపై ఫిర్యాదు చేసిన వారిలో మైనర్‌ కూడా ఉన్నందున్న పోక్సో చట్టాన్ని కూడా చేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. (Wrestlers Protest)

బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan)పై సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలో కుస్తీయోధులు (wrestlers) రోడ్డెక్కిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ పర్యవేక్షక కమిటీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఆ నివేదికను కేంద్రం బయటపెట్టకపోవడంతో పాటు బ్రిజ్‌ భూషణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు మరోసారి ధర్నా చేపట్టారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆదివారం నుంచి దీక్షకు కూర్చున్నారు. మరోవైపు, బ్రిజ్‌ భూషణ్‌పై ఓ మైనర్ సహా ఏడుగురు బాలికలు ఇటీవల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, ఇంతవరకూ ఆయనపై కేసు నమోదు చేయకపోవడంతో రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: కుస్తీ యోధుల ఆగ్రహ జ్వాల.. ఎవరీ బ్రిజ్‌ భూషణ్‌..?

ఎన్నికలు వాయిదా..

తాజా పరిణామాల నేపథ్యంలో మే 7వ తేదీన జరగనున్న డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని రెజ్లింగ్‌ సమాఖ్యతో పాటు కేంద్ర క్రీడాశాఖ కూడా ధ్రువీకరించింది.

ఇలా అవమానిస్తారా?: స్వాతి మాలీవాల్‌

బజ్‌రంగ్‌ పునియా, సాక్షి మలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు ఆదివారం నుంచి దీక్ష కొనసాగిస్తున్నారు. రాత్రి కూడా వారు దీక్షా శిబిరం వద్దే ఫుట్‌పాత్‌పై నిద్రించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘విదేశీ గడ్డపై మన త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడించిన వారిని.. ఈ రోజు ఇలా అవమానిస్తారా?’’ అంటూ ప్రభుత్వాలను ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని