WI vs INDIA: శతక్కొట్టిన కోహ్లీ.. రాణించిన అశ్విన్.. ప్రతిఘటిస్తున్న విండీస్

తొలి టెస్టులో భారత బౌలర్ల ధాటికి చిత్తుగా ఓడిన విండీస్‌.. రెండో టెస్టులో మాత్రం ప్రతిఘటిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 86/1 స్కోరుతో నిలిచింది.

Updated : 22 Jul 2023 05:26 IST

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: తొలి టెస్టులో భారత బౌలర్ల ధాటికి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ స్కోరుకే ఆలౌటై ఇన్నింగ్స్‌ తేడాతో చిత్తుగా ఓడిన విండీస్‌.. రెండో టెస్టులో మాత్రం ప్రతిఘటిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 86/1 స్కోరుతో నిలిచింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (37*), మెకంజీ(14*) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ ఇంకా 352 పరుగుల వెనుకంజలో ఉంది. ఓవర్‌ నైట్‌ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. 

భారత్ ఆలౌటైన తర్వాతి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఓపెనర్లు బ్రాత్‌వైట్, త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్ (33) శుభారంభం అందించారు. ఆరంభంలో బ్రాత్‌వైట్ నిలకడగా ఆడాడు. తొలుత నెమ్మదిగా ఆడిన త్యాగ్‌నారాయణ్ తర్వాత బౌండరీలు బాదాడు. అశ్విన్‌ వేసిన వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతడు.. సిరాజ్‌ బౌలింగ్‌లోనూ బంతిని రెండుసార్లు బౌండరీ దాటించాడు. కొద్దిసేపటికే జడేజా బౌలింగ్‌లో త్యాగ్‌నారాయణ్‌.. అశ్విన్‌కు చిక్కాడు. దీంతో 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెకంజీ ఓ సిక్స్‌, ఫోర్ బాదాడు. ఈ క్రమంలోనే రెండో రోజు ఆటను ముగించారు. 

కోహ్లీ శతకం.. అశ్విన్ హాఫ్‌ సెంచరీ

87 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (121; 206 బంతుల్లో 11 ఫోర్లు) శతకం బాదాడు. చూడముచ్చటైన స్క్వేర్‌ డ్రైవ్‌తో మూడంకెల స్కోరు (180 బంతుల్లో) అందుకున్న అతను.. తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. కోహ్లీ నాలుగున్నరేళ్లకు పైగా విరామం తర్వాత భారత్‌ అవతల శతకం సాధించాడు. కాసేపటికే మొదటి రోజు 36 పరుగులు చేసిన జడేజా (61; 152 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్.. వారికన్‌ వేసిన 99వ ఓవర్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న కోహ్లీ.. సింగిల్‌కు ప్రయత్నించగా విండీస్‌ ఆటగాడు జోసెఫ్‌ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో వికెట్‌కు నేరుగా బంతిని విసిరడంతో పెవిలియన్‌ చేరాడు. కొద్దిసేపటికే కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో జడేజా వికెట్‌ కీపర్‌ ది సిల్వాకి క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ (56; 78 బంతుల్లో 8 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌ ఆడి అర్ధ శతకం అందుకున్నాడు.

కోహ్లీ, జడేజా స్వల్ప వ్యవధిలో ఔటవడంతో అశ్విన్‌.. ఇషాన్‌ (25), ఉనద్కత్‌ (7)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తన తొలి టెస్టులో పెద్దగా ఆడే అవకాశం దక్కని ఇషాన్‌.. రెండో అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నట్లే కనిపించాడు. అయితే అతడి ఇన్నింగ్స్‌ను హోల్డర్‌ ముగించాడు. ఆ తర్వాత ఉనద్కత్‌, సిరాజ్‌ (0)లను స్పిన్నర్‌ వారికన్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో చకచకా కొన్ని షాట్లు ఆడి అర్ధశతకం పూర్తి చేసుకున్న అశ్విన్‌.. రోచ్‌ బౌలింగ్‌లో బౌల్డవడంతో ఇన్నింగ్స్‌కు తెరపడింది. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, వారికన్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్ 2, గాబ్రియల్ ఒక వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని