Shashank Singh: వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్‌ సింగ్‌..?

తన అద్భుత బ్యాటింగ్‌తో గుజరాత్‌పై పంజాబ్‌కు విజయం అందించిన శశాంక్‌ సింగ్‌పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated : 06 Apr 2024 07:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై పంజాబ్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తమది కాని మ్యాచ్‌లో కూడా పంజాబ్‌ విజయం సాధించిందంటే దానికి కారణం ఓ యువ బ్యాటర్‌. అతడే శశాంక్‌ సింగ్‌. తన సంచలన బ్యాటింగ్‌తో 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి 61 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను గుజరాత్‌ నుంచి లాగేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి శశాంక్‌పై పడింది. ఎవరీ కుర్రాడు అంటూ వెతకడం మొదలు పెట్టారు.

నాటకీయ పరిణామాల మధ్య..

శశాంక్‌ సింగ్ పంజాబ్‌ జట్టులోకి చాలా నాటకీయ పరిణామాల మధ్య వచ్చాడు. అతడిని ఎంపిక చేసుకునే సమయంలో వేలంలో గందరగోళ పరిస్థితుల చోటుచేసుకున్నాయి. మొదట ఆ జట్టు అతడిని వద్దనుకుంది. శశాంక్‌ సింగ్‌ పేరు వేలంలోకి రాగానే కనీస ధర రూ.20 లక్షలకు అతణ్ని పంజాబ్‌ కొనుగోలు చేసింది. కానీ ఆ తర్వాత తాము తీసుకోవాలనుకున్న శశాంక్‌ అతడు కాదని, మరొకరని చెప్పింది. దీంతో వేలంలో కాస్త గందరగోళ పరిస్థితి తలెత్తింది. అప్పటికే వ్యాఖ్యాత వేలాన్ని ముగించడంతో పంజాబ్‌ అంగీకరించక తప్పలేదు. ఆ తర్వాత ‘‘మేం కొనాలనుకునే ఆటగాళ్ల జాబితాలో శశాంక్‌ ఉన్నాడు. ఇద్దరు ఆటగాళ్లు ఒకే పేరుతో ఉండటంతో గందరగోళం తలెత్తింది. సరైన శశాంక్‌ సింగే జట్టులోకి వచ్చాడు’’ అని స్వాగతం పలుకుతూ పంజాబ్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనికి తగ్గట్టుగానే జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ అతడు అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు.

అప్పుడు శశాంక్‌ కెప్టెన్సీలో ధావన్‌..

పంజాబ్‌ జట్టు సారథిగా కొనసాగుతున్న శిఖర్‌ ధావన్‌ ఇటీవల శశాంక్‌ సింగ్‌ కెప్టెన్సీలో ఆడటం గమనార్హం. ఇటీవల ముంబయిలో జరిగిన డీవై పాటిల్‌ టీ20 టోర్నమెంట్‌లో గ్రూప్‌ బి జట్టుకు శశాంక్‌ నాయకత్వం వహించాడు. అతడి కెప్టెన్సీలో దినేశ్‌ కార్తిక్‌, ఆయుష్‌ బదోనీలాంటి ఆటగాళ్లు ఆడారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. శిఖర్‌ ధావన్‌ కూడా అప్పుడు అతడి సారథ్యంలో ఆడటం విశేషం. ఇప్పుడు ఐపీఎల్‌కు వచ్చేసరికి  ఇద్దరి పాత్రలు మారిపోయాయి. శిఖర్‌ కెప్టెన్సీలో శశాంక్‌ ఆడుతున్నాడు. డీవై పాటిల్‌ టోర్నమెంట్‌ సమయంలోనే శశాంక్‌ను ధావన్‌ చాలా దగ్గరగా గమనించాడు. అతడి ప్రతిభను గుర్తించి ఈ ఐపీఎల్‌ సీజన్‌ తొలి మ్యాచ్‌ నుంచే అవకాశం ఇస్తున్నాడు.

పంజాబ్‌ లాగేసుకుంది

ఆ సిక్స్‌లు అద్భుతం..

శశాంక్ ఆటతీరును కెప్టెన్‌ ధావన్‌ మ్యాచ్‌ అనంతరం మెచ్చుకున్నాడు. ‘‘ఈ మ్యాచ్‌లో అతడు బాగా ఆడాడు. సిక్స్‌లు కొట్టిన తీరు అద్భుతం. పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో ఆడుతున్నాడు’’ అని ధావన్‌ ప్రశంసించాడు.

దేశవాళీలో రాణిస్తూ..

శశాంక్‌.. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ఎక్కువగా ముంబయి తరఫున ఆడాడు. క్రికెట్‌లో ఎదగడానికి మాజీ ఫాస్ట్‌ బౌలర్‌, ప్రస్తుతం బీసీసీఐలో జనరల్‌ మేనేజర్‌ అభయ్‌ కురువిల్లా సాయం చేశాడు. శశాంక్‌లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. 58 డొమెస్టిక్‌ టీ20లు ఆడిన శశాంక్‌.. 754 పరుగులు చేశాడు. ఈ ఆల్‌రౌండర్‌ జాతీయ స్థాయిలో ఛత్తీస్‌గఢ్‌కు ఆడుతుంటాడు. పంజాబ్‌ జట్టు కంటే ముందు సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అంతకుముందు రాజస్థాన్‌, దిల్లీ జట్టులో కూడా సభ్యుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని