WTC 2023: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023.. 2025 ఫైనల్స్‌ వేదికలు ఖరారు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023 ఫైనల్‌ వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఖరారు చేసింది. 2021-23 సీజన్‌కు సంబంధించిన...

Published : 21 Sep 2022 17:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023 ఫైనల్‌ వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఖరారు చేసింది. 2021-23 సీజన్‌కు సంబంధించిన టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుదిపోరు ఓవల్ వేదికగా జరగనుంది. ఈ మేరకు ఐసీసీ ప్రకటించింది. అలాగే 2025 సీజన్‌ ఫైనల్‌కు లార్డ్స్‌ వేదిక కానుంది. ‘‘ఐసీసీ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) వేదికలను ఖరారు చేశాం. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఓవల్‌ మైదానంలో జరగనుంది. అలాగే లార్డ్స్‌ వేదికగా 2023-2025 సీజన్ ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తాం’’ అని ఐసీసీ ప్రకటనలో వెల్లడించింది. 

ఐసీసీ చీఫ్‌ జియోఫ్‌ అల్లార్డిస్‌ స్పందిస్తూ.. ‘‘ఐసీసీ ఛాంపియన్‌షిప్‌ తర్వాతి సీజన్‌ ఫైనల్‌ను ఓవల్‌లో నిర్వహించేందుకు ఆనందంగా ఉంది. అలాగే 2025 సీజన్‌ తుదిపోరుకు లార్డ్‌ వేదికగా నిలవనుంది. మొదటిసారి భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌ను అభిమానులు భారీ సంఖ్యలో ఆస్వాదించారు. ఈసారి ఓవల్‌ వేదికగా జరిగే మ్యాచ్‌నూ వీక్షిస్తారని ఆశిస్తున్నా. మద్దతుగా నిలిచిన ఇంగ్లాండ్‌ క్రికెట్‌బోర్డు, మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌, సర్రే కౌంటీ క్రికెట్‌ క్లబ్‌లకు ధన్యవాదాలు’’ అని ఐసీసీ చీఫ్‌ తెలిపారు. 

తొలిసారి జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌పై కివీస్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 2021-23 సీజన్‌లో ఆస్ట్రేలియా (70 శాతం) , దక్షిణాఫ్రికా (60 శాతం) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక (53.33 శాతం), భారత్ (52.08 శాతం)‌, పాకిస్థాన్‌ (51.85 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోపు తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు 2023 జూన్‌లో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని