WTC Final: సరైన సన్నద్ధత లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయింది: హర్భజన్‌ సింగ్

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ ఓడిపోవడానికి గల కారణాలను టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly), మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh) వివరించారు.

Published : 13 Jun 2023 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియాకు వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌(WTC Final)లో నిరాశే ఎదురైంది. 2021 ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో చేతిలో పరాజయం పాలైన భారత్..  ఈ సారి (2023) ఫైనల్‌లో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమ్‌ఇండియా (Team India) కనీస పోరాటం చేయకుండా 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఆటతీరుపై పలువురు మాజీలు విమర్శలు చేస్తున్నారు. టీమ్‌ఇండియా ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్‌ వైఫల్యమేనని గావస్కర్‌ పేర్కొన్నాడు. ఇలాంటి ఆటతీరుతో గెలుపును ఎలా ఆశిస్తారని విమర్శించాడు. భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly), మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh) కూడా భారత్‌ ఓటమికి గల కారణాలను వివరించారు. సరైన సన్నద్ధత లేకపోవడం వల్లే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలైందని భారత మాజీ స్పిన్నర్‌  హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు ఇంగ్లాండ్‌కు చాలా ఆలస్యంగా వచ్చిందని పేర్కొన్నాడు.

‘‘ఆస్ట్రేలియా.. భారత్‌ కంటే చాలా ముందుగా సన్నాహాలు మొదలెట్టింది. కొంతమంది ఆసీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడలేదు. వారు ఐపీఎల్‌ కంటే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. భారత జట్టు.. ఇంగ్లాండ్‌కు చాలా ఆలస్యంగా చేరుకుంది. పిచ్‌పై చాలా పచ్చిక ఉన్నప్పటికీ మొదటి రోజు భారత బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఆస్ట్రేలియాను 72/3తో కట్టడి చేసినా ఆ తర్వాత ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ భారత్‌కు తలనొప్పిగా మారింది.స్టీవ్ స్మిత్ కూడా సెంచరీ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం భారత్‌ సరిగ్గా సన్నద్ధం కాలేదని భావిస్తున్నా’’ అని హర్భజన్‌ సింగ్ వివరించాడు.  
భారత్ గట్టిగా పోరాడాల్సింది: గంగూలీ 

ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా గట్టిగా పోరాటం చేసి ఉండాల్సిందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఐదో రోజు రోహిత్‌ సేన నుంచి మేం ఎంతో ఆశించామని.. కానీ పోరాటం లేకుండా మ్యాచ్‌ ముగిసిందని దాదా పేర్కొన్నాడు.  ‘‘భారత్‌ నుంచి గట్టి పోరాటం లేకుండా మ్యాచ్‌ ముగిసింది. కానీ, ఐదో రోజు మేం భారత ఆటగాళ్ల నుంచి  చాలా ఎక్కువగా ఆశించాం. ముగ్గురు బ్యాటర్లు మాత్రమే (కోహ్లీ, జడేజా, రహానె) మిగిలి ఉన్నప్పుడు 280 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దేశాల్లో (ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా) ఐదో రోజు క్రికెట్ విభిన్నంగా ఉంటుంది. భారత్‌ గట్టిగా పోరాడాల్సింది’’ అని గంగూలీ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని