Sunil Gavaskar: ఇప్పుడు మూడంటావు.. తర్వాత ఐదంటావు.. ! : రోహిత్‌పై గావస్కర్‌ అసహనం

WTC Finalను మూడు టెస్టుల సిరీస్‌గా ఆడాలన్న రోహిత్‌ శర్మ(Rohit Sharma) సూచనపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) విమర్శలు గుప్పించాడు.

Published : 13 Jun 2023 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : WTC Finalలో భారత్‌ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ పరాజయం అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) చేసిన సూచనలపై విమర్శలు వస్తున్నాయి. WTC Finalను మూడు టెస్టుల సిరీస్‌గా నిర్వహించాలని రోహిత్‌ కోరాడు. అయితే భారత సారథి వ్యాఖ్యలతో ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ విభేదించాడు. ఇప్పుడు తాజాగా మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) కూడా రోహిత్‌ సూచనపై విమర్శలు చేశాడు. ఇలాంటి పెద్ద ఈవెంట్లు ఆడేముందు ముందే మానసికంగా సిద్ధం కావాలని సూచించాడు.

మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ..‘WTC Final కోసం మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడితే బాగుంటుంది. మేం ఎంతో కష్టపడ్డాం. పోరాడాం. కానీ ఫైనల్‌ కోసం ఒకే మ్యాచ్‌ ఆడాం. వచ్చే WTC సైకిల్‌లో మూడు టెస్టుల సిరీస్‌ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను’ అని రోహిత్‌ అన్నాడు.

దీనిపై గావస్కర్‌ స్పందిస్తూ..‘ఇది సరైంది కాదు. చాలా కాలం క్రితమే దీన్ని నిర్ణయించారు. WTC సైకిల్‌లో తొలి మ్యాచ్‌ ఆడటానికి ముందే ఫైనల్‌కు ఒకే మ్యాచ్‌ అన్న విషయం మీకు తెలుసు. అలాంటప్పుడు.. మానసికంగా సిద్ధం కావాల్సిందే’ అని స్పష్టం చేశాడు.

‘ఐపీఎల్‌(IPL)కు ఎలా సిద్ధమవుతారో దీనికి అలానే సిద్ధం కావాలి. అక్కడ మీరు బెస్ట్‌ ఆఫ్‌ త్రీ అని చెప్పరు. ప్రతి ఒక్కరికి చెడ్డ రోజులు ఉంటాయి. డబ్ల్యూటీసీ సైకిల్‌లో తొలి బంతిని ఎదుర్కొన్నప్పుడే మీకు ఈ విషయం తెలుసు. దీంతో బెస్ట్‌ ఆఫ్‌ త్రీ అడగలేరు. రేపు.. మీరు బెస్ట్‌ ఆఫ్‌ ఫైవ్‌ అని కూడా అడుగుతారేమో’ అంటూ గావస్కర్‌ విమర్శించాడు.

ఇక రోహిత్‌ సూచనను వ్యతిరేకించాడు ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌. ‘ఈ సూచన బాగానే ఉంది. అయితే.. మీకు 50-మ్యాచ్ సిరీస్‌ ఉంటుంది. కానీ.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకోవడం కోసం ఒకే రేసు నిర్వహిస్తారు. అదే ఆటంటే’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ద్వైపాక్షిక సిరీస్‌ల్లో గెలవడం కాదు..

ఇక WTC Finalలో టీమ్‌ఇండియా ఆటతీరుపై గావస్కర్‌ మండిపడ్డాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రాణించడం కాదని.. మెగా టోర్నీల్లో ఆస్ట్రేలియాలాంటి జట్లపై గెలవాలని పేర్కొన్నాడు. ‘మనకు వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి. వెస్టిండీస్‌ ప్రస్తుతం ఉత్తమమైన జట్టు కాదు. మీరు అక్కడికి వెళ్లి ఆ జట్టుపై 2-0, 3-0 తేడాతో విజయాలు సాధిస్తారు. అదేం పెద్ద విషయం కాదు కదా. మీరు ఫైనల్స్‌ వరకు వెళ్లి మళ్లీ ఆస్ట్రేలియాతోనే ఆడి.. అవే తప్పులు చేస్తే.. ఎప్పుడు ట్రోఫీని గెలుస్తారు?’ అని గావస్కర్‌ ప్రశ్నించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని