‘వెదురే’ బంగారమాయెనా!

దేశవ్యాప్తంగానూ, రాష్ట్రంలోనూ వెదురు పంటకు భారీగా డిమాండ్‌ పెరగనుంది. థర్మల్‌ విద్యుత్కేంద్రాల నుంచి వెలువడే కాలుష్య నియంత్రణకు బొగ్గుకు బదులు వెదురు గుళికలు(పిల్లెట్లు) తప్పనిసరిగా వాడాలన్న కేంద్ర

Published : 20 Feb 2022 04:05 IST

ఎకరాకు రూ.20 వేల పెట్టుబడితో రూ.2 లక్షల ఆదాయం

లక్ష ఎకరాల్లో సాగు అవసరం

ఉద్యానశాఖ అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగానూ, రాష్ట్రంలోనూ వెదురు పంటకు భారీగా డిమాండ్‌ పెరగనుంది. థర్మల్‌ విద్యుత్కేంద్రాల నుంచి వెలువడే కాలుష్య నియంత్రణకు బొగ్గుకు బదులు వెదురు గుళికలు(పిల్లెట్లు) తప్పనిసరిగా వాడాలన్న కేంద్ర కొత్త ఇంధన విధానమే దీనికి కారణం. బొగ్గు వినియోగం వల్ల ఏటా 21 లక్షల టన్నులకు పైగా బొగ్గు పులుసు వాయువు(సీఓ2) వాతావరణంలోకి విడుదలవుతున్నందున దేశవ్యాప్తంగా పర్యావరణం కలుషితమవుతోందని కేంద్ర విద్యుత్‌శాఖ తాజా నివేదికలో తెలిపింది. ఈ నేపథ్యంలో బొగ్గు మండించే సమయంలో ఈ గుళికలను ఏడు శాతం వాడాలని ‘జాతీయ ఇంధన విధానం’లో కేంద్రం స్పష్టం చేసింది.

25 లక్షల టన్నులు అవసరం

రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో వెదురు గుళికలు వినియోగించాలంటే 24.74 లక్షల టన్నుల వెదురు బొంగులు అవసరం. దీని మార్కెట్‌ విలువ రూ.2,969.85 కోట్లని ఉద్యానశాఖ అధ్యయనంలో తేలింది. సుమారు లక్ష ఎకరాల్లో వెదురు సాగు చేస్తే విద్యుత్కేంద్రాలకు అవసరమైన వెదురు లభిస్తుందని ప్రభుత్వానికి సూచించింది. ఎకరా వెదురు సాగుకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి అవుతుంది. వెదురు ఏపుగా పెరిగితే ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ఆదాయం వస్తుంది.

నెలకు 26 వేల టన్నులు కావాలంటున్న జిందాల్‌

ఒడిశాలోని అంగూల్‌ ప్రాంతంలో ఒక్కోటీ 600 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో రెండు థర్మల్‌ కేంద్రాలు నిర్మిస్తున్న ‘జిందాల్‌ ఇండియా థర్మల్‌ పవర్‌ కంపెనీ’ నెలకు 26 వేల టన్నుల వెదురు గుళికలు కావాలని తాజాగా టెండర్లు పిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని