Iphone: ఐఓఎస్‌ 26 అనువుగా.. ఆకర్షణీయంగా

Eenadu icon
By Technology News Desk Published : 01 Oct 2025 01:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

లిక్విడ్‌ గ్లాస్‌ డిజైన్, వినూత్న ఐకన్లతో తాజా ఐఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ ‘ఐఓఎస్‌ 26’ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఇవి మాత్రమే కాదు, కనిపించకుండా మరెన్నో ఫీచర్లు ఇందులో దాగున్నాయి. రోజువారీ వాడకానికివి బాగా ఉపయోగపడతాయి.

మెసేజెస్‌లో స్మార్టర్‌ టెక్స్ట్‌ సెలెక్షన్‌

ఇది చిన్నదే గానీ మంచి ఫీచర్‌ అని చెప్పుకోవచ్చు. మొత్తం మెసేజ్‌ కాకుండా అందులో కొంత భాగాన్నే కాపీ చేసుకోవాలని అనుకున్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఆ భాగం మీద లాంగ్‌ ప్రెస్‌ చేసి ‘చూజ్‌’ ఆప్షన్‌ను ఎంచుకొని, అవసరమైన టెక్స్ట్‌ వరకే హైలైట్‌ చేసుకోవచ్చు. దాన్ని కాపీ చేసుకొని, అవసరమైన చోట పేస్ట్‌ చేసుకోవచ్చు. మెసేజ్‌లో చిరునామా లేదా లింకుల వంటివి మాత్రమే అవసరమైన సందర్భాల్లో ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు.

సిరితో రిమైండర్‌ అనుసంధానం

రిమైండర్‌ యాప్‌ ఇప్పుడు సిరి సజెషన్స్‌తో మరింత మెరుగైంది. సఫారీ నుంచో, యాపిల్‌ న్యూస్‌ నుంచో సేవ్‌ చేసుకున్న సూచనలు లేదా వంటకాలను అంచెలంచెల టాస్కులుగా మార్చుకోవచ్చు. సరుకుల జాబితాను సృష్టించుకోవచ్చు. దీంతో మాన్యువల్‌గా ఎంటర్‌ చేయటం తప్పుతుంది. సమయం ఆదా అవుతుంది.

ఫైళ్ల మీద మరింత నియంత్రణ

ఫైల్స్‌ యాప్‌లో ఆయా రకాల ఫైళ్లకు డిఫాల్ట్‌ యాప్స్‌ను అసైన్‌ చేయటానికి ఐఓఎస్‌ తొలిసారిగా అనుమతించింది. యూజర్లు శాశ్వత సెటింగ్స్‌ కోసం ‘గెట్‌ ఇన్ఫో’ మీద క్లిక్‌ చేసి ‘ఆల్వేస్‌ ఓపెన్‌ విత్‌’ను ఎంచుకోవచ్చు. ఒక్కసారికే అయితే ‘ఓపెన్‌ విత్‌’ ఆప్షన్‌ను వాడుకోవచ్చు.

మెసేజెస్‌లో డ్రాఫ్ట్స్‌

మెసేజెస్‌లో ఇప్పుడు డ్రాఫ్ట్స్‌ ఫోల్డర్‌ కూడా జతచేరింది. సెండ్‌ చేయని టెక్స్ట్‌ ఇందులో సేవ్‌ అవుతుంది. ఇలాంటి డ్రాఫ్ట్స్‌ అన్నీ ఫిల్టర్‌ వ్యూలో కనిపిస్తాయి. దాని పూర్తి చేసి, సెండ్‌ చేయాలని అనుకున్నప్పుడు తిరిగి తీసుకోవచ్చు.

కెమెరా, ఫొటో అప్‌గ్రేడ్స్‌

ఫొటోగ్రఫీ సైతం స్వల్పంగా మెరుగైంది. పనోరమా షాట్స్‌ ఇకపై చాలా స్పష్టంగా వస్తాయి. లెన్స్‌ మురికిగా ఉంటే సిస్టమ్‌ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఐఫోన్‌ 15, ఆ తర్వాతి పరికరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వీడియో సెర్చ్‌ ఆప్షన్‌ కూడా మెరుగైంది. ఇది సెర్చ్‌ చేస్తున్న అంశం వద్దకే యూజర్లను తీసుకెళ్తుంది. ఫొటోస్‌లో ఈవెంట్‌ను గుర్తించే ఫీచర్‌నూ సమంజసమైన వివరాలను అందించేలా తీర్చిదిద్దారు. దీంతో మ్యూజిక్‌ ట్రాక్స్, కచేరీ తేదీల వంటి వాటిని తేలికగా గుర్తించొచ్చు. 

ఇష్టమైన రింగ్‌టోన్స్‌ తేలికగా

యూజర్లు ఇకపై 30 సెకండ్లలోపు నిడివి గల ఎంపీ3, ఎంపీ4 ఫైళ్ల నుంచి నేరుగా ఇష్టమైన రింగ్‌టోన్లను సెట్‌ చేసుకోవచ్చు. ఐట్యూన్స్‌ అవసరం లేదు. ఇందుకోసం ‘క్విక్‌ లుక్‌’ ఆప్షన్‌ను ఎంచుకొని, షేర్‌ చేసుకోవాలి. తర్వాత యూజ్‌ యాజ్‌ రింగ్‌టోన్‌ మీద తాకితే చాలు వెంటనే రింగ్‌టోన్‌గా సెట్‌ అవుతుంది. 

  • ఫైల్స్‌ యాప్‌ సపోర్టు లేకుండానే ఇప్పుడు సఫారీ వాడేవారు ఆన్‌లైన్‌ సోర్సుల నుంచి ఆడియో క్లిప్స్‌ను ట్రిమ్‌ చేసుకోవచ్చు. వీటిని నేరుగా రింగ్‌టోన్లుగా ఉపయోగించుకోవచ్చు.
  • మ్యాగ్‌సేఫ్‌ కేస్‌ రంగులకు సరిపోయేటట్టుగా హోం స్క్రీన్స్‌నూ మార్చుకోవచ్చు. 

అడాప్టివ్‌ పవర్‌ మోడ్‌

ఇదో కొత్త బ్యాటరీ ఆప్షన్‌. ఫోన్‌ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. లో పవర్‌ మోడ్‌ ఆప్షన్‌ మాదిరిగా కాకుండా తెలివిగా బ్యాక్‌గ్రౌండ్‌ యాక్టివిటినీ తగ్గిస్తుంది. అదీ స్మూత్‌నెస్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా.

ఫేస్‌ జెశ్చర్‌ కంట్రోల్‌

యాక్సెసబిలిటీ సెటింగ్స్‌లో ఉండే ‘హెడ్‌ ట్రాకింగ్‌ అండ్‌ ఫేస్‌ జెశ్చర్స్‌’ ద్వారా ముఖ కవళికలు, నవ్వు, కనుబొమలు ఎగరేయటం వంటి వాటితోనే ఐఫోన్‌కు ఆదేశాలు ఇవ్వచ్చు. అంటే చేతులు వాడకుండా ఫోన్‌తో పనులు చేయించుకోవచ్చన్నమాట.

స్పేషియల్‌ ఫొటోస్, వాల్‌పేపర్స్‌

మామూలు ఫొటోలనూ లోతైన, 3డీ స్టైల్‌ ఫొటోలుగా మార్చుకోవచ్చు. వాటిని లాక్‌ స్క్రీన్‌ వాల్‌పేపర్స్‌గా సెట్‌ చేసుకోవచ్చు. దీంతో సాధారణ ఇమేజ్‌లు సైతం యానిమేటెడ్‌ డెప్త్‌లో కనిపిస్తాయి. 

లిక్విడ్‌ గ్లాస్‌లో ట్రాన్స్‌పరెన్సీ తగ్గించటం

కొత్త లిక్విడ్‌ గ్లాస్‌ అందిస్తున్న పారదర్శక డిజైన్‌ నచ్చనివారికి ట్రాన్స్‌పరెన్సీని తగ్గించుకునే సదుపాయమూ ఉంది. యాక్సెసబిలిటీ సెటింగ్స్‌లోకి వెళ్లి ‘రిడ్యూస్‌ ట్రాన్స్‌పరెన్సీ’ బటన్‌ను తాకి, ఇంటర్ఫేస్‌ అంశాలు మరింత స్పష్టంగా కనిపించేలా సరిదిద్దుకోవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని