CM Revanth Reddy: ఓటర్‌ అధికార్‌ యాత్రలో సీఎం

Eenadu icon
By Telangana News Desk Updated : 27 Aug 2025 06:31 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బిహార్‌లో రాహుల్,  ప్రియాంకలతో కలిసి ర్యాలీ

ప్రియాంకను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో రోహిన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్,
భట్టి విక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: బిహార్‌లో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఓటర్‌ అధికార్‌ యాత్రలో పాల్గొన్నారు. వారితో పాటు ర్యాలీ నిర్వహించారు. రానున్న బిహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమిని గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఉదయం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్, ప్రియాంకలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిహార్‌లోని దర్భంగా వెళ్లారు. వారితో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తెలంగాణ మంత్రులు, నేతలు విడిగా మరో విమానంలో వెళ్లారు. తెలంగాణ స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు తీసుకుంటున్న చర్యలను రేవంత్‌రెడ్డి అగ్రనేతలకు వివరించినట్లు సమాచారం. రానున్న బిహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొని పార్టీ విజయం కోసం కృషి చేయాలని సీఎంకు ప్రియాంక, రాహుల్‌ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారిద్దరితో పాటు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తదితరులతో కలిసి రేవంత్‌ పాల్గొన్న ఓటర్‌ అధికార్‌ ర్యాలీకి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

‘ఓట్‌ చోర్‌- గద్దీ ఛోడ్‌’ అనే నినాదంతో రాహుల్‌గాంధీ ఓటర్‌ అధికార్‌ యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం పదోరోజు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి ప్రజలను పలకరిస్తూ ముందుకుసాగారు. ఈ సందర్భంగా సీఎంతో పాటు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితరులు ప్రియాంకను కలిసి విడిగా మాట్లాడారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనలో భాగంగా చేపట్టిన కులగణన సర్వే, దాని ప్రకారం అసెంబ్లీలో బిల్లు ఆమోదం వివరాలను ఆమెకు చెప్పారు. మంగళవారం సాయంత్రం సీఎం, మంత్రులు తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. తెలంగాణలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర వివరాలను సైతం ప్రియాంకకు వివరించినట్లు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు.


చికితను అభినందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి 

ప్రపంచ యూత్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన చికితను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. ‘తెలంగాణ బిడ్డ చికిత మరిన్ని ఘన విజయాలు అందుకోవాలి’ అని ఆకాంక్షించారు. 

Tags :
Published : 27 Aug 2025 04:22 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు