CM Revanth Reddy: నేను ఎవరి వెనకా లేను
నాలుగు కోట్ల మంది ప్రజలకు తోడుంటా.. 
ప్రాజెక్టులను అడ్డుకుంటే మరణశాసనం రాసుకున్నట్టే..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఎస్‌జీడీ పరిశ్రమ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో అనిరుధ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, మేఘారెడ్డి, దీపక్ సుర్జిత్, సుధీర్, జి.మధుసూదన్‌రెడ్డి, మల్లు రవి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, పర్నికారెడ్డి, కంపెనీ ప్రతినిధులు తదితరులు
ఈనాడు, మహబూబ్‌నగర్ - మూసాపేట, న్యూస్‌టుడే: తాను ఎవరి వెనకా లేనని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తోడుగా ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భారత రాష్ట్ర సమితిను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... ‘‘ఏ పార్టీనీ బతకనివ్వమని, ఎవరూ రాజకీయం చేయొద్దని ఒకప్పుడు అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని జైలుకు పంపించారు. చేసుకున్నోడికి చేసుకున్నంత.. అని పెద్దలు చెప్పారు. నేడు వారిలో వారే తన్నుకుంటున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు. ఎవరూ అక్కర్లేదు. వాళ్లను వాళ్లే పొడుచుకుంటారు. గతంలో ఉన్న జనతా పార్టీ కనుమరుగైంది. తెదేపా అద్భుతమైన పార్టీ. చాలామందికి అవకాశాలు కల్పించింది. ఇప్పుడు తెలంగాణలో సమస్యలను ఎదుర్కొంటోంది. అది (భారత రాష్ట్ర సమితి) కూడా కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ’’ అని పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్‌జీడీ కార్నింగ్ టెక్నాలజీస్ ఫర్నేస్ లైటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సభలో ప్రసంగించారు.
దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు
‘‘రాజకీయాల కారణంగా ప్రాజెక్టులను అడ్డుకుంటే మనకు మనమే మరణశాసనం రాసుకున్న వారమవుతాం. రాజకీయాలు వస్తుంటాయి... పోతుంటాయి... అభివృద్ధి పనులను కలిసికట్టుగా పూర్తి చేసుకుందాం. ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో జీవో 69 ద్వారా కొడంగల్-నారాయణపేట ప్రాజెక్టును సాధించుకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాన్ని తొక్కిపెట్టారు. అందుకే రూ.4 వేల కోట్లు కేటాయించి, టెండర్లు పిలిచేందుకు ముందుకెళ్తోంటే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో కేసులు వేసి అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. కొన్నిచోట్ల భూసేకరణ వివాదాలున్నాయి. ఎకరానికి రూ.14 లక్షల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించినా సరిపోదంటున్నారు. కొడంగల్‌లో ఎకరానికి రూ.20 లక్షల చొప్పున ఇచ్చారని, మాకూ అంత ఇవ్వాలని కోరుతున్నారు. తప్పు లేదు. అది కోస్గి పట్టణానికి ఆనుకుని ఉన్న ఖరీదైన ప్రాంతం కావడంతో కాస్త ఎక్కువ ఇచ్చాం. రైతులను పిలిపించి మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యే పర్నికారెడ్డి, అధికారులు మాట్లాడాలి. వారికి న్యాయం చేద్దాం. మంచి నష్టపరిహారం ఇద్దాం. భూములు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయండి.పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులు, వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్‌ని ఇప్పుడు పూర్తి చేసుకోకుంటే ఎప్పటికీ పూర్తికావు.
పిల్లలు ఉన్నత చదువులు చదవాలి...
మన తలరాతలు మారాలంటే... వలసల బారి నుంచి బయటపడాలంటే పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలి. పాలమూరు నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లే కాదు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రావాలి. వసతులు కల్పించే బాధ్యత పాలమూరు బిడ్డగా నేను తీసుకుంటా. హైదరాబాద్-బెంగళూరు మార్గాన్ని డిఫెన్స్ కారిడార్‌గా మార్చుకోవాలి. ఈ రంగంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులున్నాయి. మంచి ప్రణాళికలను రూపొందించుకుందాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, పర్నికారెడ్డి, వీర్లపల్లి శంకర్, మేఘారెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ బేదుల్లా కొత్వాల్, ఎస్‌జీడీ కార్నింగ్ సంస్థ ప్రతినిధులు దీపక్ సుర్జిత్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 - 
                        
                            

అప్పుడు ఒక్క మ్యాచ్ ఆడితే రూ.1,000 ఇచ్చారు: మిథాలి రాజ్
 - 
                        
                            

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అపరెల్ గ్రూప్‌ను ఆహ్వానించిన మంత్రి నారాయణ
 - 
                        
                            

కొలికపూడి, కేశినేని పంచాయితీ.. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
 - 
                        
                            

యువత ‘రీల్స్’లో బిజీగా ఉండాలని మోదీ కోరుకుంటున్నారు: రాహుల్
 


