రూ.1658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పది టీఎంసీల నీటిని మళ్లించడం ద్వారా 90 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో కొత్తగా ‘చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని’ తెలంగాణ ప్రభుత్వం

Published : 24 Apr 2022 04:42 IST

కాళేశ్వరం నుంచి పది టీఎంసీలు మళ్లించేలా నిర్మాణం

74,270 ఎకరాల కొత్త ఆయకట్టు, 15,730 ఎకరాల స్థిరీకరణ లక్ష్యం

పరిపాలన అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

ఈనాడు హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పది టీఎంసీల నీటిని మళ్లించడం ద్వారా 90 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో కొత్తగా ‘చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని’ తెలంగాణ ప్రభుత్వం చేపట్టనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నీటిని మళ్లించేందుకు నిర్మించిన లక్ష్మి, సరస్వతి, పార్వతి బ్యారేజీల నుంచి నీటిని మళ్లించే ఈ పథకానికి రూ.1,658 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

మంచిర్యాల జిల్లా పరిధి ఎగువ ప్రాంతంలోని భూములకు నీరందించేలా కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల బ్యాక్‌వాటర్‌ నుంచి నీటిని ఎత్తిపోసేలా పథకాన్ని చేపట్టాలని చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు రెండేళ్లుగా సంబంధిత ఇంజినీర్లు, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య తిరుగుతున్నాయి. ఎట్టకేలకు గత మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించడంతో తాజాగా ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ పథకం పూర్తయితే 74,270 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందడంతోపాటు మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్ననీటి వనరుల కింద 15,730 ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది.

ఏయే ప్రాంతాలకు ప్రయోజనమంటే..
పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ వెనకభాగంలో జైపూర్‌ మండలం శెట్‌పల్లి నుంచి నీటిని ఎత్తిపోసి జైపూర్‌, భీమారం, మందమర్రి మండలాల్లో 20,417 ఎకరాల కొత్త ఆయకట్టుకు, 5,005 ఎకరాల స్థిరీకరణకు నీరందిస్తారు. సరస్వతి (అన్నారం) బ్యారేజీ వెనకభాగంలో చెన్నూరు మండలం నరసక్కపేట నుంచి నీటిని ఎత్తిపోసి 39,413 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిస్తారు. 8,795 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ వెనకభాగంలో కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామం నుంచి నీటిని మళ్లించి 14,440 ఎకరాల కొత్త ఆయకట్టు, 1940 ఎకరాల స్థిరీకరణకు నీరందిస్తారు. ఈ పథకానికి ఆర్థికశాఖ ఇప్పటికే అనుమతిచ్చిన నేపథ్యంలో త్వరలోనే టెండరు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని