గృహలక్ష్మికి ని‘బంధనాలు’

రాష్ట్రంలో సొంత స్థలాలున్న నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తుండగా... మరోవైపు ప్రధాన నిబంధనలపై దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated : 21 Aug 2023 08:31 IST

రేషన్‌ కార్డుల్లేక చాలామందికి అనర్హత
మహిళల పేరిట సొంత జాగాలదీ సమస్యే
వలస వెళ్లిన వారికీ ఇక్కట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సొంత స్థలాలున్న నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తుండగా... మరోవైపు ప్రధాన నిబంధనలపై దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రేషన్‌కార్డు/ఆహారభద్రత కార్డు; ఆధార్‌, ఓటరు ఐడీ,  మహిళల పేరిటే స్థలం ఉండాలనే నిబంధనలు ఎంపికకు ప్రతిబంధకంగా మారాయని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఆరేళ్ల క్రితం కొత్త రేషన్‌కార్డులకు దాదాపు పది లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో మూడు లక్షల మందికి పైగా కొత్తకార్డులు ఇవ్వగా మిగిలిన వారికి రాలేదు. ఈ ఆరేళ్లలో ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారు, కొత్తగా పెళ్లయిన వారు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. తల్లిదండ్రులు, అత్తామామల పేర్లతో కూడిన రేషన్‌కార్డుల్లోనే వారి పేర్లున్నాయి.  

నగరాలు, పట్టణాలకు వెళ్లిన వారికి ఇబ్బందులు

లబ్ధిదారులు స్థానికులై ఉండాలనే నిబంధన కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వెళ్లిన వారు తమ ఆధార్‌, ఓటరు కార్డులను అక్కడి చిరునామాకు మార్చుకుంటున్నారు. వారికి ఊళ్లల్లో భూమి ఉన్నా నగరాలు, పట్టణాల్లోని చిరునామా ఉండటంతో గ్రామాల్లో స్థానికేతరులవుతున్నారు. మరోవైపు లబ్ధిదారులు బ్యాంకులో ప్రత్యేక అకౌంట్‌ ఓపెన్‌ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. బ్యాంకులు సైతం చిరునామా ప్రామాణికంగానే ఖాతాలు ప్రారంభిస్తున్నందున ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఇబ్బంది ఎదురవుతోంది.

పరిశీలనలోనూ అవే అవరోధాలు

దరఖాస్తుల పరిశీలన బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. ప్రస్తుత నిబంధనలను అనుసరించి చాలామందిని వారు అనర్హులుగా పేర్కొంటున్నారు.

  • సూర్యాపేటకు చెందిన రాజయ్యకు ఇద్దరు కుమారులు. రేషన్‌కార్డులో తండ్రితో పాటు వారి పేర్లు ఉన్నాయి. రాజయ్యకు ఆర్‌సీసీ స్లాబ్‌ ఇల్లు ఉంది. గృహలక్ష్మి పథకం కింద ఆయన ఇద్దరు కోడళ్లూ దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ కార్యదర్శి వారి ఇంటికి వెళ్లిచూసి ఆర్‌సీసీ స్లాబ్‌ ఇల్లు ఉందని దరఖాస్తు తిరస్కరించారు. తమది ఉమ్మడి కుటుంబం కాదని విడిపోయామని రాజయ్య కుమారులు చెప్పినా ఫలితం లేకపోయింది.

కుటుంబానికి ఒక్కరికే...

మ్మడి కుటుంబానికి ఒకటే రేషన్‌కార్డు ఉండి అందులో నలుగురు మహిళల పేర్లు ఉంటే ఒక్కరినే అర్హురాలిగా గుర్తిస్తున్నారు. మిగిలిన ముగ్గురి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అలాగే పేద మహిళల పేరిట ఇళ్ల స్థలాలు రాష్ట్రంలో దాదాపుగా లేవు. తండ్రి, భర్త, మామల పేరిట ఉంటున్నాయి. కొందరు వారి పేరిట రిజిస్ట్రేషన్‌కు యత్నించినా... దానికి రూ.వేలల్లో రుసుము ఉందని తెలిసి వెనక్కి తగ్గుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని