124 ఏళ్ల నాటి వర్షాభావం

దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో జూన్‌లో వర్షపాతం లోటు ఏర్పడింది. జులైలో అధిక వర్షాలతో ఆ లోటు తీరిపోయింది. మళ్లీ ఆగస్టు ఆరంభం నుంచి చినుకుజాడ లేదు. రుతుపవనాల గమనాన్ని ఎల్‌నినో దెబ్బతీయడంతో మందగించి వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి’ అని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న చెప్పారు.

Published : 23 Aug 2023 04:58 IST

దేశంలో 1899 ఆగస్టులో 40 శాతం లోటు వర్షపాతం
ప్రస్తుత నెలలో ఇప్పటికే 35 %..
తెలంగాణలో 66 శాతం లోటు
వానాకాలంపై ‘ఎల్‌నినో’ ప్రభావం

దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో జూన్‌లో వర్షపాతం లోటు ఏర్పడింది. జులైలో అధిక వర్షాలతో ఆ లోటు తీరిపోయింది. మళ్లీ ఆగస్టు ఆరంభం నుంచి చినుకుజాడ లేదు. రుతుపవనాల గమనాన్ని ఎల్‌నినో దెబ్బతీయడంతో మందగించి వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి’ అని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న చెప్పారు.

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలంలోనూ చినుకు జాడలేక దేశవ్యాప్తంగా 289 జిల్లాల్లో కరవు ఛాయలు అలముకున్నాయి. గత 124 ఏళ్లలో తొలిసారి ఆగస్టులో పలు రాష్ట్రాల్లో సాధారణ సగటు వర్షపాతంతో పోలిస్తే 35 శాతానికి మించి లోటు ఏర్పడింది. 1899 ఆగస్టు నెలలో జాతీయ స్థాయిలో అత్యధిక లోటు 40 శాతంగా, 1913లో 31 శాతంగా నమోదవగా, ఈ ఏడు మరోసారి అదే పరిస్థితి పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ఈ నెలలో రానున్న అయిదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే, తీవ్ర తుపాన్లు ఏర్పడే పరిస్థితి లేదని వాతావరణశాఖ ఇప్పటికే అంచనా వేసింది. వర్షాభావం ఇలాగే కొనసాగితే ఈ నెలలో లోటు 40 శాతం దాటిపోయే సూచనలున్నాయి’ అని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

తెలంగాణలోనూ

ఈ నెల 1 నుంచి మంగళవారం(22వతేదీ) నాటికి రాష్ట్ర సగటు వర్షపాతం (166.6 మిల్లీమీటర్ల) కన్నా 66 శాతం లోటు ఏర్పడింది. జిల్లాల వారీగా చూస్తే వికారాబాద్‌లో అత్యధికంగా 93, జనగామలో 90, సిద్దిపేటలో 83, రంగారెడ్డి, సంగారెడ్డిల్లో 82% చొప్పున లోటుంది. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 44 మండలాల్లో అత్యధిక, 284 మండలాల్లో అధిక, 242 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇంకా 42 మండలాల్లో లోటే ఉంది. గత వారం రోజులుగా వర్షాలు పడుతున్నా అవి కొన్ని జిల్లాలకే పరిమితమవుతున్నాయి. నెలాఖరు వరకు భారీ వర్షాలు కురవని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సగటున లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  వాతావరణశాఖ లెక్కల ప్రకారం సాధారణ సగటు వర్షపాతం కన్నా 19% ఎక్కువ లేదా తక్కువ కురిసినా సాధారణం కిందనే పరిగణిస్తారు. ఆ ప్రకారం దేశవ్యాప్తంగా గత జూన్‌ 1 నుంచి మంగళవారం వరకూ 289 జిల్లాల్లో 19 శాతానికి మించి లోటు ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో ఈ నెలలో ఏ ఒక్క జిల్లాలోనూ సాధారణ వర్షపాతం కూడా లేదని వెల్లడించింది. ‘వానాకాలంలో రెండుసార్లు వర్షాలు కురిసే మధ్య కాలాన్ని పొడి విరామం అంటారు. ఈ విరామం సాధారణంగా వారం, పదిరోజులు ఉంటుంది. ఈ నెలలో దేశవ్యాప్తంగా వందల జిల్లాల్లో 20 రోజులకుపైగా పొడి విరామం ఏర్పడింది. సాధారణంగా జూన్‌లో వేసిన పైర్లు ఆగస్టులో కురిసే వర్షాలకు ఏపుగా ఎదిగి పూత, కాత దశకు వస్తాయి. ఆ వర్షాల ఆధారంగానే వానాకాలంలో పంటల దిగుబడి పెరుగుతుంది. విరామకాలం పెరగడంతో జూన్‌, జులై నెలల్లో వర్షాధార భూముల్లో వేసిన పైర్లు ఎండిపోతున్నాయి’ అని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఈ ఏడాది వానాకాలంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, ప్రధానంగా ఆగస్టు, సెప్టెంబరులో ఇది ఎక్కువగా కనిపిస్తుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ముందే హెచ్చరించాయి. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం పరిస్థితులున్నాయి’ అని వాతావరణశాఖ సంచాలకురాలు నాగరత్న చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు