ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా తెలంగాణ మహిళ

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రం సిడ్నీ నగరంలోని స్ట్రాత్‌ఫీల్డ్‌ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్‌గా తొలిసారిగా తెలుగు మహిళ కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) గురువారం ఎన్నికయ్యారు.

Updated : 08 Sep 2023 05:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రం సిడ్నీ నగరంలోని స్ట్రాత్‌ఫీల్డ్‌ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్‌గా తొలిసారిగా తెలుగు మహిళ కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) గురువారం ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ సంతతి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన ఆమె స్థానిక స్టాన్లీ కళాశాలలో ఇంటర్మీడియట్‌ వరకు చదివారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో న్యాయవాద పట్టా పొందారు. ఉస్మానియాలో ఎంఏ చేశారు. ఆమె తల్లిదండ్రులు పట్లోళ్ల శంకర్‌రెడ్డి, సారారెడ్డి. 1991లో కర్రి బుచ్చిరెడ్డి అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో ఆమెకు వివాహం కాగా భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడి ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో మైగ్రేషన్‌ లా డిగ్రీ పొందారు. తర్వాత ఆమె ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాదిగా పనిచేశారు. స్థానికంగా ఉంటూ భర్తతో కలిసి విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె చొరవతో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం స్ట్రాత్‌ఫీల్డ్‌లోని హోమ్‌బుష్‌ కమ్యూనిటీ సెంటర్‌లో ఏర్పాటయింది.

ఆమె సేవలకు గుర్తింపుగా 2020లో సిటిజన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం లభించింది. 2021లో ఆమె నివాసం ఉండే స్ట్రాత్‌ఫీల్డ్‌ పురపాలక సంఘానికి ఎన్నికలు జరిగాయి. స్థానికంగా ఉన్న ప్రవాసభారతీయులతో పాటు ఆస్ట్రేలియా వాసులు సైతం ఆమెను పోటీ చేయాలని కోరారు. స్థానిక లేబర్‌, లిబరల్‌ పార్టీల అభ్యర్థులపై స్వతంత్ర అభ్యర్థినిగా పోటీచేసి ఆమె విజయం సాధించారు. ఈ పురపాలక సంఘానికి ఏటా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు జరుగుతాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనకు ఈ అవకాశం దక్కడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు నీల్‌, నిఖిల్‌రెడ్డిలు. వీరిలో నిఖిల్‌రెడ్డి ఈ ఏడాది ఆస్ట్రేలియా జాతీయ చదరంగం ఛాంపియన్‌గా నిలిచాడు. సంధ్యారెడ్డి స్ట్రాత్‌ఫీల్డ్‌ డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావడంపై భారాస ప్రవాస విభాగం సమన్వయకర్త బిగాల మహేశ్‌, ఇతర నేతలు అభినందనలు తెలిపారు. ఆమె ఎన్నిక తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని