కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నకిలీ బోనఫైడ్లు..!

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు స్థానికత కోసం నకిలీ బోనఫైడ్‌ పత్రాలు సమర్పించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట సుమారు 350 మంది పత్రాలు నకిలీవిగా అనుమానించి పక్కనపెట్టారు.

Published : 08 Mar 2024 08:06 IST

ప్రాథమిక విద్య రెండు జిల్లాల్లో చదివినట్లుగా గుర్తింపు
వంద మందికి శిక్షణ నిలిపివేత.. వారి విద్యాభ్యాసంపై క్షేత్రస్థాయి విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు స్థానికత కోసం నకిలీ బోనఫైడ్‌ పత్రాలు సమర్పించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట సుమారు 350 మంది పత్రాలు నకిలీవిగా అనుమానించి పక్కనపెట్టారు. అనంతరం ప్రాథమిక విచారణలో 250 నిజమేనని తేలింది. దీంతో మిగతా 100 మందికి శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసి, క్షేత్రస్థాయిలో స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులతో లోతుగా విచారణ చేయిస్తున్నారు. వారు చదివిన పాఠశాలల రిజిస్టర్లతో సహా తనిఖీ చేయనున్నారు.

సుదూర ప్రాంతాల వారికి హైదరాబాద్‌ స్కూళ్లలో..

రాష్ట్రవ్యాప్తంగా 13,444 మంది అభ్యర్థులు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టీఎస్‌ఎస్‌పీకి చెందిన 5,010 మందికి మినహా సివిల్‌, ఏఆర్‌ తదితర విభాగాల వారికి ఫిబ్రవరి 21 నుంచి 9 నెలల శిక్షణ మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 7 వరకు నాలుగు తరగతులు ఎక్కడ చదివి ఉంటే అక్కడి స్థానికుడిగా పరిగణిస్తారు. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల స్థానికతకు పాఠశాలలు ఇచ్చే బోనఫైడ్‌లనే ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు ప్రాథమిక విద్య రెండు జిల్లాల్లో చదివినట్లు.. అందులో ఒకటి హైదరాబాద్‌ జిల్లా ఉన్నట్లు పరిశీలనలో వెలుగుచూసింది. సుదూర ప్రాంతాలకు చెందిన వారు నగరంలో చదివినట్లు చూపడం.. అవి కూడా కొన్ని తరగతులే కావడంతో అనుమానాలకు బలం చేకూర్చింది. జీవో 46 ప్రకారం జనాభా ప్రాతిపదికన పోస్టులు కేటాయించి నియామకాలు చేపడతారు. సాధారణంగా హైదరాబాద్‌ పరిధిలో ఎక్కువ పోస్టులుంటాయి. దీంతో ఇక్కడి పాఠశాలల నుంచి నకిలీ బోనఫైడ్‌ తీసుకున్నట్లు స్పెషల్‌ బ్రాంచి అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండే ఒక పాఠశాల పదుల సంఖ్యలో అభ్యర్థులకు బోనఫైడ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు పాఠశాలలపైనా ఆరా తీస్తున్నారు.


శిక్షణకు 10 శాతం మంది దూరం!

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా నియమితులైన పోలీస్‌ కానిస్టేబుళ్లకు గత నెల చివరివారంలో శిక్షణ ప్రారంభం కాగా.. ఇప్పటికీ పలువురు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. శిక్షణకు ఎంపికైన వారిలో సుమారు 10 శాతం మంది ఇంకా రిపోర్ట్‌ చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ శిక్షణ కళాశాలలు (పీటీసీలు), నగర శిక్షణ కేంద్రాలు (సీటీసీలు), జిల్లా శిక్షణ కేంద్రాల (డీటీసీల)తోపాటు టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్లు అన్నీ కలిపి 28 కేంద్రాల్లో గత నెల 21 నుంచి శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 13,953 మంది కానిస్టేబుళ్లకుగాను తొలిదశలో 9,333 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించగా.. మొదటిరోజు సుమారు 6,500 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ నెల మొదటివారం ముగిసేనాటికి ఇంకా 900 మంది వరకు శిక్షణకు హాజరు కాలేదని తెలిసింది. కంటి పరీక్షల్లో జాప్యం వల్ల ఎక్కువమంది హాజరు కాలేకపోయినట్లు తేలింది. ఇతర పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు రావడంతో పలువురు  హాజరు కాలేదని చెబుతున్నారు. పెట్టీ కేసులు, నకిలీ బోనఫైడ్‌ సర్టిఫికెట్లు దాఖలు చేసినట్లు స్పెషల్‌ బ్రాంచి విచారణలో తేలడం వంటి కారణాలతో మరికొందరు శిక్షణకు అర్హత సాధించలేకపోయినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని