చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు

హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలో చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోతున్న జల్‌పల్లి, ఉమ్దాసాగర్‌ చెరువులతోపాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

Published : 24 Apr 2024 03:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలో చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోతున్న జల్‌పల్లి, ఉమ్దాసాగర్‌ చెరువులతోపాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. మెట్రో ప్రాజెక్టుతో భూముల ధరలు పెరగడంతో ఆక్రమణదారుల కన్ను చెరువులపై పడిందని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ హైకోర్టుకు లేఖ రాశారు. నీటి వనరుల ఆక్రమణ సామాజిక దురాచారమని, అది పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని లేఖలో పేర్కొన్నారు. ఆక్రమణలను తొలగించి చెరువుల పునరుద్ధరణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌లోని అంశాలను పరిశీలించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ, జల్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌, మెట్రో రైల్‌ ఎండీ, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఆక్రమణల బారి నుంచి చెరువుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని