శంషాబాద్‌ విమానాశ్రయంలో చిరుత కలకలం

శంషాబాద్‌ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్‌పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్‌ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది.

Published : 29 Apr 2024 03:09 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్‌పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్‌ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. అది రన్‌వేపైకి వస్తే ప్రమాదమని గుర్తించిన భద్రతాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. రన్‌వే వైపు రాకుండా పహారా కాశారు. సీసీ కెమెరాల్లో పరిశీలించగా.. చిరుత ఆనవాళ్లు కనిపించాయి. అటవీశాఖ అధికారులను రప్పించారు. రన్‌వే, ప్యాసింజర్‌ టెర్మినల్‌ భవనం వైపు అది రాకుండా టపాసులు కాల్చారు. చిరుతను బంధించడానికి అటవీ, విమానాశ్రయ అధికారులు రెండుచోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు అటవీ అధికారులు గాలించినా ఆచూకీ దొరకలేదు. విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌ సమయంలో వచ్చే శబ్దాలకు భయపడి బయటకు వెళ్లిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గొల్లూర్‌ రిజర్వ్‌ ఫారెస్టు విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండడంతో అక్కడి నుంచి అడవి జంతువులు ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడుతున్నాయని అటవీ అధికారులు తెలిపారు. 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రన్‌వే ప్రాంతంలో సగానికిపైగా ఖాళీగా ఉండడంతో చెట్లు ఏపుగా పెరిగి.. చిట్టడవిలా మారింది. చిరుత అటువైపు వెళ్లి ఉండవచ్చని.. విమానాశ్రయం సమీపంలోని ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని