955 టీఎంసీలు అవసరం

కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది.

Published : 30 Apr 2024 06:12 IST

బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కు తెలంగాణ నివేదన
1,144 టీఎంసీలు కావాలన్న ఏపీ
కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాల అవసరాలు 2,099 టీఎంసీలు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. తాగు నీటికి తీసుకొనే నీటిలో 20 శాతం, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీటిలో ఇంకా తక్కువ లెక్కలోకి తీసుకోవాల్సి ఉన్నందున తమ వినియోగం 789.8 టీఎంసీలుగా పరిగణించాలని తెలంగాణ కోరింది. గోదావరి నుంచి మళ్లించడం ద్వారా అందుబాటులోకి వచ్చే నీటిపై ఈ ట్రైబ్యునల్‌కు విచారణ పరిధి లేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలలో 555 టీఎంసీలు తమ రాష్ట్రానికి రావాల్సి ఉందని తెలంగాణ పేర్కొంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు మార్చి 20న తెలంగాణ స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌(ఎస్‌వోఎస్‌) దాఖలు చేయగా, ఆంధ్రప్రదేశ్‌ సోమవారం దాఖలు చేసింది. గడువు కావాలని ఆంధ్రప్రదేశ్‌ కోరినా, ఈ నెల 29లోగా దాఖలు చేసి తీరాల్సిందేనని ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది. ట్రైబ్యునల్‌లో దాఖలు చేయడంతోపాటు రెండు రాష్ట్రాలు పరస్పరం తమ స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేసులను ఇచ్చి పుచ్చుకోగా, రెండూ కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. తర్వాత తదుపరి వాదనలు జరగనున్నాయి. బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించగా, తర్వాత 2013లో తీర్పు చెప్పిన బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలోని క్యారీఓవర్‌ స్టోరేజీ సహా మరో 194 టీఎంసీలు అదనంగా కేటాయించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 1,005 టీఎంసీలుగా పేర్కొంది. ఈ నీటిని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు రాష్ట్రాలు కలిపి తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా పేర్కొన్నాయి. రెండు రాష్ట్రాలు దాఖలు చేసిన స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

బచావత్‌ కేటాయింపుల్లో తెలంగాణ వాటా 555 టీఎంసీలు

బచావత్‌ ట్రైబ్యునల్‌ 75 శాతం నీటి లభ్యత కింద కేటాయించిన 811 టీఎంసీలలో తమకు దక్కాల్సింది 555 టీఎంసీల కంటే తక్కువ కాదని, ఈ మేరకు కేటాయించాలని తెలంగాణ కోరింది. ‘‘కృష్ణా ట్రైబ్యునల్‌-2 అదనంగా 65 శాతం నీటి లభ్యత కింద చేసిన 43 టీఎంసీల కేటాయింపు మొత్తాన్ని మా వాటాగా ఇవ్వాలి. సరాసరి నీటి లభ్యత కింద కేటాయించిన 145 టీఎంసీలలో 120 టీఎంసీలకు తక్కువ కాకుండా ఇవ్వాలి. గోదావరి నుంచి కృష్ణాబేసిన్‌కు మళ్లించే నీటిలో 45 టీఎంసీలను మాకే కేటాయించాలి. సుప్రీంకోర్టులో ఉన్న సివిల్‌ అప్పీల్‌ 5178 కేసులో అదనంగా వచ్చే మొత్తం నీటిని తెలంగాణకు కేటాయించాలి. కృష్ణా బేసిన్‌కు బయట ఉన్న నాగార్జునసాగర్‌, కేసీ కాలువ, తుంగభద్ర హెచ్చెల్సీ, గుంటూరు ఛానల్‌ కింద ఆయకట్టును ఒక ఆరుతడి పంటకు మాత్రమే పరిమితం చేయాలి. 1976 తర్వాత కృష్ణా బేసిన్‌కు బయట 75 శాతం నీటి లభ్యత కింద చేపట్టిన ప్రాజెక్టులకు నీటిని మళ్లించకుండా చూడాలి. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపుల మేరకు 2,578 టీఎంసీలకు మించి వచ్చే మిగులు నీటిని పూర్తిగా వినియోగించుకొనే స్వేచ్ఛను తెలంగాణకు ఇవ్వాలి. బేసిన్‌ అవసరాలకు, బేసిన్‌లోని ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు తెలంగాణకు చేసిన కేటాయింపులు కచ్చితంగా వచ్చేలా చూడాలి. రాష్ట్రంపై ప్రభావం చూపే ఏ ప్రాజెక్టులనూ ఆంధ్రప్రదేశ్‌ చేపట్టకుండా ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇవ్వాలి. నీటి కేటాయింపుల్లో ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, ఆసిఫ్‌నగర్‌ ప్రాజెక్టుకు 2.54 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ఎస్‌.ఎల్‌.బి.సి.కి 40, కల్వకుర్తి ఎత్తిపోతలకు 53, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 25.4, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 90, డిండి ఎత్తిపోతలకు 30 కలిపి 238.4 టీఎంసీలు కేటాయించాలి. ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులకు 216.5 టీఎంసీలు, కృష్ణాట్రైబ్యునల్‌-2 జూరాలకు అదనంగా కేటాయించిన తొమ్మిది టీఎంసీలు కలిపి సాగునీటి అవసరాలకు మొత్తం 765.44 టీఎంసీలు అవసరం. తాగునీటికి 55.49, పశు సంపదకు 19.83, పారిశ్రామిక అవసరాలకు 107.54, థర్మల్‌ విద్యుత్తుకు 6.6 కలిపి 189.46 టీఎంసీలు కావాలి. ఇందులో వినియోగం లెక్కలోకి మాత్రం 24.36 టీఎంసీలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం వినియోగించుకొంటున్న 512 టీఎంసీలలో 291 టీఎంసీల ఆదా ఉంది’’ అని తెలంగాణ నివేదించింది.

ప్రాజెక్టు వారీ కేటాయింపుల్లో మార్పు చేయడానికి వీల్లేదు: ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-1 క్లాజ్‌ 9(ఇ)(1)(ఎ) కింద  చేసిన కేటాయింపుల్లో ప్రాజెక్టు వారీ కేటాయింపులు చేసే సమయంలో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. ‘‘బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 75 శాతం నీటి లభ్యత కింద చేసిన కేటాయింపులకు సంబంధించి పేర్కొన్న 28 ప్రాజెక్టులు, తర్వాత పునఃకేటాయింపులు జరిగినవి కలిపి వినియోగంలో ఉన్న ప్రాజెక్టులుగానే పరిగణించాలి. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలు పేరా పదిలో పేర్కొన్న ప్రాజెక్టులు, కేంద్రం 2022 జులై 27న విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాజెక్టులను నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులుగా పరిగణించి కేటాయింపులు చేయాలి. పునర్విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులు చేసిన తర్వాత కృష్ణాబేసిన్‌లోని మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే చెందుతాయి. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు, ఆపరేషన్‌ ప్రొటోకాల్‌కు ఇండిపెండెంట్‌ ఏజెన్సీ అవసరం. అంతర్‌ రాష్ట్ర నదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలో ఉత్పత్తయ్యే విద్యుత్తు వాటా పంపిణీకి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. వాస్తవాలు, పరిస్థితులకు అనుగుణంగా ట్రైబ్యునల్‌ తగిన ఆదేశాలు ఇవ్వకపోతే కృష్ణా నదిపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్‌కు పూడ్చలేనంత నష్టం వాటిల్లుతుంది. నీటి కేటాయింపుల్లో బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం 512 టీఎంసీలు, మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు 125.5 టీఎంసీలు, కృష్ణా ట్రైబ్యునల్‌-2 చేసిన కేటాయింపు 29 టీఎంసీలు, రాష్ట్రం పునర్విభజన తర్వాత అదనంగా వచ్చిన డిమాండ్‌ మేరకు 176.46, అదనంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 114.75 టీఎంసీలు కలిపి సాగునీటికి 957.71 టీఎంసీలు అవసరం. తాగునీటికి 140.62, పారిశ్రామిక అవసరాలకు 29.23, నేవిగేషన్‌కు 14, జల విద్యుత్తుకు రెండు టీఎంసీలు కావాలి. మొత్తం అన్ని అవసరాలకు 1,143.56 టీఎంసీలు అవసరం’’ అని ఆంధ్రప్రదేశ్‌ ట్రైబ్యునల్‌ను కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని