ఎక్సైజ్‌ అధికారుల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేం హైకోర్టు

ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్‌ అధికారులకు మినహాయింపునిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది.

Published : 30 Apr 2024 04:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్‌ అధికారులకు మినహాయింపునిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఎక్సైజ్‌ అధికారులను బదిలీ చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అయితే మద్యం సరఫరాపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సందర్భంగా చేపట్టే బదిలీల్లో ఎక్సైజ్‌ అధికారులకు మినహాయింపునివ్వడాన్ని సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన బి.నాగధర్‌సింగ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు విని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లకు పైగా ఒకే స్థానంలో ఉన్న అధికారుల బదిలీల విషయంలో ఎక్సైజ్‌ శాఖ అధికారులకు మినహాయింపు ఇవ్వడం ద్వారా మద్యం సరఫరాలో నియంత్రణ ఉండదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రత్యక్షంగా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే  అధికారులను పార్లమెంట్‌ నియోజకవర్గం బయట బదిలీ చేస్తారని, ఇతర అధికారులను రెవెన్యూ జిల్లా బయటికి బదిలీ జరుగుతుందని, అక్రమంగా మద్యం, నగదు పంపిణీలను అడ్డుకోవడానికి ఇతర శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న దశలో ఎక్సైజ్‌ అధికారుల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని