కొరత లేకుండా ఎరువుల సరఫరా

రాష్ట్రంలో వానాకాలం సీజన్‌కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది.

Published : 03 May 2024 06:27 IST

పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక 
5.93 లక్షల టన్నుల యూరియా నిల్వ
ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వానాకాలం సీజన్‌కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. గత ఏడాది వానాకాలం సీజన్‌లో 10.42 టన్నుల యూరియా వినియోగమైంది. ఈసారీ అదేస్థాయిలో ఉంటుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. 10.40 లక్షల టన్నుల సరఫరాకు సన్నాహాలు చేస్తోంది. ఉత్పత్తి సంస్థలను సంప్రదించి.. ఎరువులను దిగుమతి చేసుకుని, మార్క్‌ఫెడ్‌ ద్వారా నిల్వ చేస్తోంది. నిరుడు మే నెలలో 3.10 లక్షల టన్నుల యూరియాను వ్యవసాయశాఖ నిల్వ చేసింది. అక్కడక్కడ కొరత ఏర్పడడంతో ఈ ఏడాది అప్రమత్తమైంది. గత ఏడాది కంటే 2.83 లక్షల టన్నులు అదనంగా అంటే 5.93 లక్షల టన్నులు నిల్వ చేసింది. విక్రయాలనూ ప్రారంభించింది. ఈ నెలలో 1.70 లక్షల టన్నుల అమ్మకాలు జరుగుతాయనే అంచనాలున్నాయి. మొత్తం 10.40 లక్షల టన్నుల లక్ష్యంలో 5.42 లక్షల టన్నుల మేరకు యూరియా వచ్చే జులై నాటికి వినియోగమయ్యే అవకాశముంది. ప్రస్తుతం అంతకంటే ఎక్కువ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదించింది. యూరియాతో పాటు ఇతర ఎరువుల నిల్వలనూ ఈ ఏడాది పెంచింది. డీఏపీ 75,505 టన్నులు, కాంప్లెక్స్‌ 3,67,505, పొటాష్‌ 23,716, భాస్వరం 11,998 టన్నులు నిల్వ చేసింది. యూరియాతో కలిపి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,71,086 లక్షల టన్నుల మేరకు ఎరువులు నిల్వల ఉన్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెలలో డీఏపీ 60 వేల క్వింటాళ్లు, కాంప్లెక్స్‌ ఎరువులు రెండు లక్షలు, పొటాషియం 10 వేల క్వింటాళ్ల విక్రయాలు జరుగుతాయని అంచనా. 

నానో యూరియా పెంచేందుకు సన్నాహాలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నానో యూరియా, డీఏపీ విక్రయాలను ఈ ఏడాది పెంచేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు రైతుల్లో వ్యవసాయ సమూహాల వారీగా అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని