హైదరాబాద్‌-విజయవాడ రహదారి దిద్దుబాటు పనులు చేపట్టండి

‘హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి దిద్దుబాటు పనులను వెంటనే చేపట్టాలి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నిర్ధారిత సమయంలో పూర్తి చేయాలి’ అని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Updated : 18 May 2024 03:17 IST

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ‘హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి దిద్దుబాటు పనులను వెంటనే చేపట్టాలి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నిర్ధారిత సమయంలో పూర్తి చేయాలి’ అని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చౌటుప్పల్‌ నుంచి తెలంగాణ సరిహద్దు సమీపంలోని నవాబ్‌పేట వరకు 17 ప్రాంతాల్లో అండర్‌ పాస్‌లు, సర్వీసు రోడ్లు, జంక్షన్ల అభివృద్ధికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల సంస్థ టెండర్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ మార్గంలోని బ్లాక్‌స్పాట్స్‌ను చక్కదిద్దేందుకు గుత్తేదారు సంస్థ భూ పరీక్షలు నిర్వహించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ జాతీయ రహదారి గుండా పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి తాజా సమీక్షా సమావేశంలో ఒప్పందం మేరకు ఆయా పనులు చేపట్టడం, వేగ నియంత్రణకు సంబంధించిన సైన్‌బోర్డుల ఏర్పాటు తదితర పనులపై చర్చించారు. పనుల నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రాంతీయ రింగు రోడ్డు భూ సేకరణ ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఇతర జాతీయ రహదారుల నిర్మాణాల తీరుతెన్నులపై నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. సమీక్షా సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ అధికారి రజాక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని