నిరసనల నిప్పుసెగ ఆరాలంటే...

దేశీయంగా నిరసనల సమయంలో ఒక్కోసారి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు పెద్దయెత్తున విధ్వంసానికి గురవుతున్నాయి. దీన్ని నివారించేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఆర్డినెన్స్‌ తెచ్చింది. 2020లో ఉత్తర్‌ప్రదేశ్‌, 2021లో హరియాణా సైతం ఇదే తరహా చట్టాలు చేశాయి.

Published : 23 Apr 2024 01:12 IST

దేశీయంగా నిరసనల సమయంలో ఒక్కోసారి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు పెద్దయెత్తున విధ్వంసానికి గురవుతున్నాయి. దీన్ని నివారించేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఆర్డినెన్స్‌ తెచ్చింది. 2020లో ఉత్తర్‌ప్రదేశ్‌, 2021లో హరియాణా సైతం ఇదే తరహా చట్టాలు చేశాయి.

క్కులకు, జీవనానికి భంగం వాటిల్లినప్పుడు బాధిత ప్రజాసమూహాలు అహింసాయుతంగా నిరసన తెలియజేసే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించింది. ప్రభుత్వ విధానాలు, చర్యలను నిరసిస్తూ ప్రతిపక్షాలు, ఇతర సంఘాలు, జనసమూహాలు ఆందోళన బాట పడతాయి. ప్రదర్శన, హర్తాళ్‌, బంద్‌ రూపంలో సాగే నిరసనలు కొన్నిసార్లు దారితప్పుతున్నాయి. హింసాకాండ చెలరేగి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా బస్సులు, రైళ్లు, ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు తదితరాలు బుగ్గి అవుతున్నాయి. ఒక్కోసారి ప్రజల ప్రాణాలూ పోతున్నాయి. వీటిని నివారించేందుకు కేంద్రం 1984లో ప్రజా ఆస్తుల నష్ట నిరోధక (పీడీపీపీ) చట్టాన్ని రూపొందించింది. ఇందులోని నిబంధనలు హింసాత్మక ఘటనల సంఖ్యను, తీవ్రతను తగ్గించలేకపోతున్నాయని సుప్రీంకోర్టు 2007లో సు మోటోగా స్వీకరించిన ఒక కేసులో వ్యాఖ్యానించింది. రాజకీయ పరమైన ఉద్యమాల సమయంలో జరిగే ఆస్తుల విధ్వంసాన్ని నిలువరించేందుకు కఠినమైన చట్టం అవసరమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అందులో భాగంగా అదే ఏడాది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కేకే థామస్‌ నేతృత్వంలో న్యాయకోవిదుడు ఫాలీ నారీమన్‌ అధ్యక్షతన రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. థామస్‌ కమిటీ సూచనలను ఆమోదిస్తూ కేంద్రం పీడీపీపీ చట్టానికి 2015లో సవరణలు ప్రతిపాదించింది. ఉత్తరాదిలో సుదీర్ఘ ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో ప్రజా ఆస్తుల రక్షణ కోసం కొన్ని రాష్ట్రాలు సొంతంగా కఠిన చట్టాలు రూపొందించుకుంటున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్‌ ఆర్డినెన్స్‌ తెచ్చింది. నిరసనల సమయంలో ప్రజా ఆస్తుల విధ్వంసాన్ని ఆపడమే దీని ప్రధాన ఉద్దేశం. రాబోయే శాసనసభ సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు.

ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం నిరసనల సమయంలో అల్లర్లు చెలరేగి జరిగిన ఆస్తుల నష్టాన్ని బాధ్యుల నుంచే వసూలు చేస్తారు. గాయపడినవారి చికిత్సకు అయ్యే వ్యయాలనూ వారే భరించాల్సి ఉంటుంది. అల్లర్ల తాలూకు నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఓ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తుంది. అల్లర్ల అనంతరం శాంతిభద్రతల పరిరక్షణలో పాలుపంచుకున్న ప్రభుత్వ సిబ్బందికి అయ్యే ఖర్చుల కింద గరిష్ఠంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు జరిమానాను సైతం ఉద్రిక్తతలకు బాధ్యులైనవారి నుంచి రాబట్టవచ్చు. నైనీతాల్‌ జిల్లా హల్ద్వానీలో చెలరేగిన హింసలో ఆరుగురు చనిపోయిన నేపథ్యంలో పుష్కర్‌సింగ్‌ ధామీ సర్కారు హుటాహుటిన ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. నాలుగు దశాబ్దాల కిందటి పీడీపీపీ చట్టం దోషులను గుర్తించి జైలుశిక్ష విధింపునకు ప్రాధాన్యమిస్తే, ఉత్తరాది రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలు రికవరీలకు పెద్దపీట వేశాయి. జస్టిస్‌ కేకే థామస్‌ కమిటీ నివేదిక ఆధారంగా 2015లో కేంద్రం తెచ్చిన సవరణ బిల్లులో జైలుశిక్ష, రికవరీలు రెండింటినీ సమన్వయపరచారు. దీని ప్రకారం ఆస్తుల విధ్వంసం జరిగిన సందర్భంలో ఆందోళనకు పిలుపిచ్చిన సంస్థలు, సంఘాల బాధ్యులను విచారణ పరిధిలోకి తెస్తారు. మార్కెట్‌ విలువకు అనుగుణంగా నష్టపోయిన ఆస్తుల్ని లెక్కగట్టి రాబడతారు.

కేవలం ఆర్డినెన్సులు, చట్టాల వల్ల నిరసనల సమయంలో ఆస్తుల విధ్వంసం దిగివస్తుందన్న నమ్మకం లేదు. నిరసనల్లోకి సంఘవిద్రోహ శక్తులు చొరబడి ధ్వంసం సృష్టించినప్పుడు ఆయా సంఘాలు, సంస్థల పెద్దలను జవాబుదారీ చేయడం సరికాదు. ప్రశ్నించే స్వరాలను అణచివేయాలని, ప్రతిపక్షాలను అభాసుపాలు చేయాలనే ఉద్దేశంతో పాలక శ్రేణులే ఇలాంటి చట్టాలు, ఆర్డినెన్సులను దుర్వినియోగం చేస్తే పరిస్థితులు మరింతగా దిగజారతాయి. ఏది ఏమైనా ప్రభుత్వాలు తెస్తున్న చట్టాలు అంతిమంగా ప్రశ్నించే గళాలను, నిరసన స్వరాలను అణచివేయకూడదు. దానివల్ల ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుంది. మరోవైపు నిరసనల సమయంలో ఆగ్రహాన్ని నినాదాల రూపంలో తెలియజెప్పాలి తప్ప, చేతులకు పనిచెప్పకూడదు. ఆ మేరకు నిరసనకారులు సంయమనం పాటించాలి. అసాంఘిక శక్తులు తమ నిరసనల్లోకి చొరబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యమాలు, నిరసనల సమయంలో ప్రభుత్వాలు పెద్దయెత్తున పోలీసులను మోహరించి ప్రజా, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లకుండా సమర్థంగా కాచుకోవాలి.

సముద్రాల స్వామినాథ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.