నష్టాల ఊబిలో విద్యుత్‌ సంస్థలు

దేశంలో పెరుగుతున్న కరెంటు వినియోగం, గిరాకీ విద్యుత్‌ సంస్థలను నష్టాల్లోకి నెడుతున్నాయి. అధికమవుతున్న డిమాండుకు అనుగుణంగా విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)లకు బిల్లుల సొమ్మును పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లు చెల్లించడం లేదు. దాంతో జెన్‌కోల ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రాజకీయ నిర్ణయాలతో డిస్కమ్‌లను రాష్ట్రాలు దెబ్బతీస్తుండటంవల్ల అవి బిల్లులు చెల్లించలేకపోతున్నాయి.

Published : 29 Apr 2024 00:25 IST

దేశంలో పెరుగుతున్న కరెంటు వినియోగం, గిరాకీ విద్యుత్‌ సంస్థలను నష్టాల్లోకి నెడుతున్నాయి. అధికమవుతున్న డిమాండుకు అనుగుణంగా విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)లకు బిల్లుల సొమ్మును పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లు చెల్లించడం లేదు. దాంతో జెన్‌కోల ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రాజకీయ నిర్ణయాలతో డిస్కమ్‌లను రాష్ట్రాలు దెబ్బతీస్తుండటంవల్ల అవి బిల్లులు చెల్లించలేకపోతున్నాయి.

నిరంతర కరెంటు సరఫరా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలతో విద్యుత్‌ సంస్థలు అప్పులు, నష్టాలతో కునారిల్లుతున్నాయి. దేశంలోని అన్ని డిస్కమ్‌లకు నష్టాలు భారీగా పెరగడంతో వాటి ముఖవిలువ మైనస్‌లోకి వెళ్ళిపోయిందని జాతీయ విద్యుత్‌ ఆర్థిక సంస్థ (పీఎఫ్‌సీ) తాజా నివేదిక ఎండగట్టింది. డిస్కమ్‌లు తీసుకున్న అప్పులు రూ.6.84 లక్షల కోట్లను దాటిపోయాయి. వీటి వాణిజ్య, పంపిణీ, సరఫరా(ఏటీసీ) నష్టాలు 15.37 శాతానికి చేరాయి. అంటే వంద యూనిట్లను ఒక డిస్కమ్‌ సరఫరా చేస్తే 15.37శాతం యూనిట్లకు సొమ్ము రావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఈ నష్టాలు 40శాతం వరకూ ఉండటం శోచనీయం.

ఏపీలో అస్తవ్యస్త విధానాలు

దేశంలో ఒక యూనిట్‌ కరెంటు సరఫరాకు జాతీయ సగటు వ్యయం(ఏసీఎస్‌) రూ.7.11కు చేరగా, సగటు ఆదాయం రూ.6.65 మాత్రమే వస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు, ఉచిత కరెంటుకు తిరిగి సొమ్ము చెల్లించకపోవడం వల్ల యూనిట్‌కు సగటున 46 పైసల నష్టం వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఏపీ డిస్కమ్‌లు రూ.81 వేల కోట్ల అప్పులు, రూ.29 వేల కోట్ల నష్టాల్లో మునిగాయి. ప్రస్తుత ఏడాదిలో కూడా డిస్కమ్‌ల ఆదాయం, ఖర్చుల మధ్య ఏకంగా రూ.13 వేల కోట్ల లోటు ఉంటుందని డిస్కమ్‌లే వెల్లడించాయి. తెలంగాణలో 24 గంటలూ వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నా ఏపీలో ఇవ్వడం లేదు. తెలంగాణలో ఉన్నంత రోజూవారీ విద్యుత్‌ డిమాండు కూడా ఏపీలో లేదు. ప్రజల ఇళ్లు లేదా పరిశ్రమలు, ఇతర అవసరాలకు కరెంటు కనెక్షన్‌ను డిస్కమ్‌లు ఇస్తాయి. విద్యుదుత్పత్తి చేసే జెన్‌కోల నుంచి కరెంటు కొని డిస్కమ్‌లు సరఫరా చేయాలి. జెన్‌కో లేదా డిస్కమ్‌లన్నీ కంపెనీ చట్టం కింద ఏర్పాటైనవే. విద్యుత్‌ చట్టం-2003 ప్రకారం డిస్కమ్‌ ఎవరికి కరెంటు సరఫరా చేసినా కచ్చితంగా బిల్లు వసూలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా లేదా తక్కువ ఛార్జీకి కరెంటు ఇవ్వాలని చెబితే దానికయ్యే బిల్లు సొమ్మును ముందే డిస్కమ్‌లకు కచ్చితంగా విడుదల చేయాలి. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకు ఇవ్వాలని చెబుతున్న కరెంటు రాయితీల విలువ 2022-23లోనే లక్షా 69 వేల కోట్ల రూపాయలను దాటిపోయింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాయితీల నిధులు విడుదల చేయకపోవడంతో డిస్కమ్‌లు 2023 మార్చి నాటికే రూ.67వేల కోట్ల మేర నష్టాల్లో ఉన్నాయి. నష్టాల వల్ల సొమ్ములు లేక డిస్కమ్‌లు బిల్లులు చెల్లించకపోవడంతో జెన్‌కోల నష్టాలు రూ.1,688 కోట్లకు చేరాయి. వాస్తవానికి పలు దేశాల్లో జెన్‌కోలు లాభాల్లో పయనిస్తుంటే మన దేశంలో డిస్కమ్‌లపై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం కారణంగా నష్టాలబారిన పడుతున్నాయి.

పెరుగుతున్న డిమాండు

దేశం మొత్తం రోజూవారీ గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ ఇప్పటికే 2.43 లక్షల మెగావాట్లకు చేరింది. ఇది 2013-14లో లక్షా 30 వేల మెగావాట్లుండగా, 2030 నాటికి 3.80 లక్షల మెగావాట్లను దాటవచ్చని తాజా అంచనా. ఈ స్థాయిలో నిరంతర కరెంటు సరఫరా దేశమంతా జరగాలంటే కాలనీల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ తీగలు, సబ్‌స్టేషన్ల నుంచి జెన్‌కో ప్లాంట్ల వరకూ అన్నింటి సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేయాలి. కొత్తగా వేలాది సబ్‌స్టేషన్లను దేశమంతా నిర్మించాలి. డిస్కమ్‌లు నష్టాలతో సకాలంలో బిల్లుల చెల్లించక దాదాపు 70,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న విద్యుదుత్పత్తి కేంద్రాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ ప్రభావంతో కొత్తగా థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలకు ప్రైవేటు పెట్టుబడుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో అన్ని రకాల జెన్‌కోల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 4.34 లక్షల మెగావాట్లకు చేరింది. కానీ పెరుగుతున్న డిమాండును తీర్చేలా, వేసవిలో కరెంటు కోతలు లేకుండా చూడాలంటే అదనంగా దేశంలో 80 మెగావాట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలను నిర్మించాలని కేంద్ర విద్యుత్‌శాఖ ప్రణాళిక రచించింది. తలసరి విద్యుత్‌ వినియోగం వేగంగా పెరుగుతున్నందువల్ల విద్యుత్‌ డిమాండ్‌, సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించాలి. ఇది జరగాలంటే డిస్కమ్‌లు, జెన్‌కోలను నష్టాలు, అప్పుల నుంచి గట్టెక్కించాలి. ముందుచూపులేని ప్రభుత్వాలతో విద్యుత్‌ రంగం దెబ్బతింటే భవిష్యత్తులో అంధకారంలో మగ్గాల్సి ఉంటుందని ప్రజలు గుర్తించాలి.

మంగమూరి శ్రీనివాస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.