చుండ్రును తగ్గించే జామాకు!
ఇటీవలి కాలంలో అందరిలోనూ కామన్‌గా కనిపిస్తోన్న సమస్య జుట్టు రాలడం. విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కోవడం, పోషకాహార లోపం, కాలుష్య ప్రభావం.. ఇలా జుట్టు రాలిపోవడానికి కారణాలెన్నో..! మరి, ఈ సమస్యను తగ్గించుకొనేందుకే తలకు హెయిర్‌ప్యాక్స్....
ఇటీవలి కాలంలో అందరిలోనూ కామన్‌గా కనిపిస్తోన్న సమస్య జుట్టు రాలడం. విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కోవడం, పోషకాహార లోపం, కాలుష్య ప్రభావం.. ఇలా జుట్టు రాలిపోవడానికి కారణాలెన్నో..! మరి, ఈ సమస్యను తగ్గించుకొనేందుకే తలకు హెయిర్‌ప్యాక్స్ వేసుకోవడం, బ్యూటీపార్లర్‌లో ప్రత్యేక ట్రీట్‌మెంట్లు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. వీటికి తోడు ఇంటి చిట్కాల్ని సైతం పాటిస్తుంటారు. అయితే జామాకులను ఉపయోగించడం ద్వారా కూడా జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. జామాకుల్లో ఉన్న ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు.. కురులకు సరైన పోషణనూ అందిస్తాయి అని చెబుతున్నారు.
జామాకుల్లో విటమిన్ 'సి' ఉంటుంది. ఇది శరీరంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సైతం ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ని శరీరం నుంచి బయటకు పంపించి వెంట్రుకలు పాడవకుండా కాపాడతాయి. అలాగే జామాకుల్లో ఉండే లైకోపీన్ హానికారక అతి నీలలోహిత కిరణాల నుంచి జుట్టుని సంరక్షిస్తుంది.
సిల్కీ హెయిర్ కోసం..
గిన్నెలో లీటరు నీటిని పోసి వేడి చేయాలి. దీనిలో శుభ్రం చేసిన జామాకులు వేసి 20 నిమిషాల పాటు మరిగించాలి. దీన్ని చల్లారనిచ్చి మరో గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఈ మిశ్రమం హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేయాలి. అలాగే మాడుకు పట్టేలా పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఇలా రెండు గంటలు ఉంచుకొని తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడిగేస్తే సరి. కురులు మృదువుగా తయారవడంతో పాటు కాలుష్యం బారి నుంచి రక్షణ కూడా లభిస్తుంది.
చుండ్రు తొలగిపోయేలా..
ఒత్తిడి, కాలుష్యం కారణంగా చాలామంది ఎదుర్కొంటోన్న సమస్య చుండ్రు. దీనివల్ల దురదతో పాటు వెంట్రుకలు కూడా రాలిపోతుంటాయి. జామాకులతో తయారుచేసుకున్న హెయిర్ ప్యాక్ ఈ విషయంలో మంచి ఫలితాన్నిస్తుంది. జామాకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నీటిని కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గుతుంది అంటున్నారు నిపుణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.