Trump: ట్రంప్‌పై మరో రాష్ట్రం వేటు.. ప్రైమరీలో పోటీ చేయకుండా నిషేధం

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై మరో రాష్ట్రం వేటు వేసింది. ప్రైమరీ ఎన్నికల నుంచి ఆయన పేరును తొలగిస్తున్నట్లు మైన్‌ రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు.

Updated : 29 Dec 2023 17:44 IST

పోర్ట్‌లాండ్ (అమెరికా): రెండోసారి అమెరికా (USA) అధినేతగా ఎన్నికయ్యేందుకు బరిలోకి దిగిన రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దేశాధ్యక్షుడి పదవికి ఆయన అనర్హుడని ఇటీవల కొలరాడో (Colorado) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా మరో రాష్ట్రం ఆయనపై వేటు వేసింది. ఈ సారి ‘మైన్‌ (Maine)’ ప్రైమరీ బ్యాలెట్‌ పోరు నుంచి ట్రంప్‌ పేరును తొలగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సెక్రటరీ (ప్రధాన ఎన్నికల అధికారి) తాజాగా వెల్లడించారు. కొలరాడో తీర్పుపై రిపబ్లికన్‌ పార్టీ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. మైన్‌ రాష్ట్రంలో ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాల్‌ చేశారు. వారి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సెక్రటరీ షెన్నా బెల్లోస్‌.. ట్రంప్‌ పేరును ప్రైమరీ బ్యాలెట్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ ఉత్తర్వులపై ట్రంప్‌ కోర్టుకెళ్లేందుకు అవకాశం కల్పించారు. అప్పటిదాకా ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో బెల్లోస్‌ నిర్ణయాన్ని రిపబ్లికన్‌ పార్టీ.. మైన్‌ రాష్ట్ర కోర్టుల్లో సవాల్‌ చేయనుంది. కాగా.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరును ఓ ఎన్నికల అధికారి ఇలా బ్యాలెట్‌ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ట్రంప్‌ ‘అనర్హత’ తీర్పుపై సుప్రీంకు రిపబ్లికన్‌ పార్టీ

2020 అధ్యక్ష ఎన్నికలో ట్రంప్‌ ఓడిపోయినప్పుడు బైడెన్‌ను అడ్డుకోవడానికి.. 2021 జనవరి 6న రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులు యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడికి దిగారు. వారిని ట్రంప్‌ సమర్థించారని, హింసను ప్రేరేపించారన్న అభియోగాలపై ఇటీవల కొలరాడో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దేశాధ్యక్ష పదవికి ఆయన అనర్హుడని తేల్చింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిని నిర్ణయించే ప్రక్రియలో భాగంగా నిర్వహించే కొలరాడో రాష్ట్ర ప్రైమరీ బ్యాలెట్‌ పోరులో ఆయన పేరును చేర్చరాదని స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర రిపబ్లికన్‌ పార్టీ అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది.

2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కొలరాడోలో ఓడిపోయారు. ఆ రాష్ట్ర ఓట్లు ఈసారి ట్రంప్‌నకు అంతగా అక్కర్లేకపోయినా ఆయన గెలిచి తీరాల్సిన రాష్ట్రాల్లో కూడా కోర్టులు, ఎన్నికల అధికారులు ఆ తీర్పును పాటిస్తే, ఆయన పోటీకి పూర్తిగా దూరమవుతారు. కొలరాడో తీర్పు నేపథ్యంలోనే ఇప్పుడు మైన్‌ రాష్ట్రంలో ఆయనపై వేటు పడింది. దీంతో ఈ ‘అనర్హత’ విషయంలో అమెరికా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ట్రంప్‌ భవితవ్యం ఆధారపడి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని