Antarctica: అంటార్కిటికాలో అర్జెంటీనా సైజు హిమఫలకం అదృశ్యం.. ఆందోళనలో శాస్త్రవేత్తలు

అంటార్కిటాకా వాతావరణ మార్పులు అత్యంత వేగంగా చోటు చేసుకొంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ సారి మంచు కరిగిపోయింది.    

Updated : 30 Jul 2023 15:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరార్ధ గోళంలో నెలకొన్న అత్యధిక ఉష్ణోగ్రతలు అంటార్కిటికా(Antarctica)లో మంచు ఫలకాలను శరవేగంగా కరిగించేస్తున్నాయి.  తాజాగా  అంటార్కిటికా ఖండంలో ఓ భారీ హిమఫలకం కరిగిపోయింది. ఇక్కడి సముద్రంలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి మంచు పడిపోయింది. వాస్తవానికి ఏటా ఎండాకాలంలో మంచు కరిగి తిరిగి శీతాకాలంలో భారీ హిమఫలకాలు ఏర్పడటం ఇక్కడ సాధారణమే. కానీ, ఈ సారి మాత్రం గతంలో వలే ఈ సారి మంచు ఏర్పడకపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో మంచు ఉంది. గత శీతాకాలం(2022)తో పోల్చుకొంటే 16లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో మంచు తగ్గినట్లు నేషనల్‌ స్నో అండ్‌ ఐస్‌ డేటా సెంటర్‌ గణాంకాలు చెబుతున్నాయి. 

ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణను వ్యతిరేకించలేదు : పుతిన్‌

1981-2010 మధ్య నెలకొన్న సగటు కంటే ఈ ఏడాది జులై మధ్యలో అంటార్కిటికా సముద్రంలో 26లక్షల చదరపు కిలోమీటర్ల మంచు తక్కువగా ఉంది. ఈ విస్తీర్ణం దాదాపు అర్జెంటీనా దేశానికి సమానం. దాదాపు 10 లక్షల సంవత్సరాల్లో ఒకసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొలారాడో బౌల్డర్‌ యూనివర్శిటికి చెందిన గ్లేసియాలజిస్టు టెడ్‌ స్కాంబోస్‌ పేర్కొన్నారు. ‘‘పరిస్థితి పూర్తిగా మారిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. 

అంటార్కిటిక్‌లో కొన్ని దశాబ్దాల్లోనే మంచు అత్యధిక స్థాయి నుంచి అత్యల్ప స్థాయికి చేరింది. ఈ ప్రాంతం ప్రపంచంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శాస్త్రవేత్తలను కలవరానికి గురిచేస్తున్నాయి. 2016 నుంచి ఇక్కడ సముద్రంలో మంచు నిరంతరం కరుగుతున్నట్లు గుర్తించారు. ‘‘అంటార్కిటిక్‌లో పరిస్థితులు తరచూ మారుతుంటాయి. ప్రస్తుత మార్పు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. గత రెండేళ్లలో ఏదో పెనుమార్పు చోటు చేసుకొంది’’ అని గ్లేసియాలజిస్టు టెడ్‌ స్కాంబోస్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని